క్రికెట్‌ బెట్టింగ్‌: మైనర్లు కాదు..ముదుర్లు!

13 Jun, 2021 14:10 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు  

బెట్టింగ్‌ల కోసం అప్పులు

వాటిని తీర్చేందుకు చోరీలు

మోటారు సైకిళ్లను అపహరించిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఆదోని అర్బన్‌(కర్నూలు జిల్లా): చక్కగా చదువుకుని మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన విద్యార్థులు వారు.  చెడు అలవాట్లకు బానిసై కటకటాల పాలయ్యారు. క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు మోటారు సైకిళ్లు చోరీ చేసి పోలీసులకు దొరికిపోయారు. ఆదోని టూ టౌన్‌ సీఐ శ్రీరాములు వారిని అరెస్ట్‌ చూపుతూ శనివారం వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీకి  చెందిన విష్ణు పదో తరగతి చదువుతున్నాడు. పత్తికొండకు చెందిన ఎజాజ్‌ ఇంటర్‌ చదువుతూ ఆదోని పట్టణంలోని కార్వన్‌ పేటలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.

క్రికెట్‌ ఆడుతూ వీరు స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఆడుతూ ఒక్కొక్కరు రూ.15వేలు అప్పు చేశారు. అప్పుల వారి బాధతాళలేక ఏం చేస్తే డబ్బు వస్తుందని ఆలోచనలో పడి తుదకు బైక్‌ దొంగలుగా మారారు. స్ప్లెండర్‌ ప్లస్‌ బైక్‌ దొంగలిస్తే వెంటనే అమ్ముడవుతుందని పథక రచన చేసుకున్నారు. అలా మూడు బైక్‌లను దొంగలించారు. రెండు బైక్‌లను ఆదోని పట్టణంలో పాడుబడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రి బంగ్లాలో దాచిపెట్టారు. మరొక బైక్‌ను అమ్మేందుకు పత్తికొండకు వెళ్లారు. అక్కడ అమ్ముడుపోకపోవడంతో తిరిగి ఆదోనికి వస్తుండగా ఆస్పరి రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బైకులు అపహరించినట్లు చెప్పారు. వీరి నుంచి మూడు బైకులు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.

చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్‌ 
దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు