Hyderabad: చదివేది బీటెక్‌, సీఏ.. చేసే పనులేమో చైన్‌ స్నాచింగ్‌లు..

16 Nov, 2022 20:02 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌(నాగోలు): జల్సాకు కోసం గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను ఎల్‌బీనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ కథనం ప్రకారం... వరంగల్‌ జిల్లా దుగంటి మండలం, చెల్లపల్లికి చెందిన ముస్కు రాకేష్‌(24) చైతన్యపురిలోని హాస్టల్‌లో ఉంటూ చిక్కడపల్లి సీఏ చదువుతున్నారు.

మహబూబ్‌బాద్‌ జిల్లా కొత్తగూడ మండలం, గాంధీనగర్‌కు చెందిన పగిళ్ల అఖిల్‌(25) చైతన్యపురిలో హాస్టల్‌ ఉంటూ హయత్‌నగర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు.  రాకేష్‌ ఏడాది కాలంగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్న అతడు వాటిని చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాడు.  జాల్సాకు, ఇతర ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో గొలుసు దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.

చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..)

తన చిన్ననాటి స్నేహితుడైన పగిళ్ల అఖిల్‌తో విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి గొలుసు చోరీలకు ప్లాన్‌ చేశారు. హోండా యాక్టివాపై సాయంత్రం సమయంలో కాలనీలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలును, వృద్ధులైన పురుషులను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న బంగారు గొలుసులు స్నాచింగ్‌ చేసుకొని పారిపోతున్నారు. ఇదే క్రమంలో ఇద్దరూ కలిసి జూలై 2న మన్సురాబాద్‌లో కిరాణా షాప్‌ నుంచి తన ఇంటికి తిరిగి వస్తున్న వనం చంద్రకళ మెడలో ఉన్న బంగారు గొలుసును స్నాచింగ్‌ చేశారు.

ఈనెల ఒకటో తేదీన మన్సూరాబాద్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో పున్నా భిక్షమయ్య మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు గొలుసుని తెంచుకొని పారిపోయారు. ఈ నెల 11 బోడుప్పల్‌లో చంద్రకళావతి వద్ద మెడలో ఉన్న 3 తులాలు బంగారు గొలుసు స్నాచింగ్‌  చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. నిందితులు యూట్యూబ్‌లో వీడియోలు చూసి చోరీలు చేసినట్లు సమాచారం.  

చదవండి: (ఒకే మహిళతో ఇద్దరు ఎఫైర్‌.. చివరికి దారుణంగా..!)

మరిన్ని వార్తలు