సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం..

9 Sep, 2022 07:54 IST|Sakshi
తన్మయి (ఫైల్‌)- కోమలిత (ఫైల్‌)

కుషాయిగూడ (హైదరాబాద్‌):  సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి.
చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..?

ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇళ్లకు చేరతారనగా.. 
చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్‌ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది.

దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారాయణ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు