‘మదర్స్‌ డే’ నాడు అమ్మకు కేక్‌ కొనాలని వెళ్తూ..

10 May, 2021 04:49 IST|Sakshi
వెంకిబాబు, ఏసుబాబు (ఫైల్‌ ఫొటోలు)

బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల మృత్యువాత 

‘మదర్స్‌ డే’ నాడు ఇద్దరు తల్లులకు తీరని గర్భశోకం 

నరసరావుపేట రూరల్‌: మదర్స్‌ డే సందర్భంగా అమ్మను సంతోషపెట్టాలని కేక్‌ కొనేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరారు. ఈ విషాద ఘటన మాతృ దినోత్సవం నాడు ఇద్దరు తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాలు.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన మలతోటి వెంకిబాబు (19), వేమర్తి ఏసుబాబు (17)లు ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా కేక్‌ కొనేందుకు బైక్‌పై నరసరావుపేటకు వస్తుండగా కేసానుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద ఈద్గా వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

వీరిలో వెంకిబాబు ఐటీఐ చదువుతుండగా, ఏసుబాబు పదో తరగతిలో చేరాల్సి ఉంది. వెంకిబాబుకు తల్లిదండ్రులు వెంకటరావు, వజ్రమ్మ, ఒక సోదరి ఉన్నారు. ఏసుబాబు తల్లిదండ్రులు సుధాకరరావు, పుష్పలీలలకు అతనొక్కడే సంతానం. మాతృదినోత్సవం నాడే కొడుకును కోల్పోవాల్సి రావడంతో కన్నవారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ టి.సూర్యనారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు