మృత్యువులోనూ వీడని బంధం

30 Apr, 2022 08:37 IST|Sakshi

చిన్ననాటి నుంచి వారిద్దరూ మిత్రులు. ఏ పనైనా కలిసే చేసుకునేవారు. ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అనుకుంటూ సాగేవారు. వీరిని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను విషాదాంతంగా ముగించింది. బాధిత కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది
ధర్మవరం రూరల్‌: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో దర్శనమల ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తలారి  నరేంద్ర(24), అతని స్నేహితుడు అంకే రామాంజనేయులు(23) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దర్శనమలకు చెందిన నరేంద్ర, రామాంజనేయులు చిన్ననాటి నుంచి స్నేహితులు.

ఇటీవలే రామాంజనేయులు తన వ్యవసాయ పొలంలో బోరు వేయించాడు. చీనీ మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. పొలంలోని మట్టిని అనంతపురంలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించేందుకు శుక్రవారం మిత్రుడు నరేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగిశాక మిత్రులిద్దరూ బైక్‌పై ధర్మవరం వైపు వస్తున్నారు. గరుడంపల్లి సమీపంలోకి రాగానే ఎస్‌కే యూనివర్సిటీలో పనిచేస్తున్న లక్ష్మీపతి ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి ఎదురుగా వీరి వాహనాన్ని ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. సంఘటనా స్థలంలోనే ముగ్గురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.  స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నరేంద్ర, రామాంజనేయులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ద్విచక్ర వాహనదారుడు లక్ష్మీపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నరేంద్రకు భార్య ఇందు, కుమార్తె సంతానం. రామాంజనేయులుకు భార్య రమాదేవి, కుమారుడు ఉన్నారు. ధర్మవరం రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో దర్శనమలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ మృతుల కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది.   

(చదవండి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. చక్రం తిప్పిన పరిటాల బంధువు)

మరిన్ని వార్తలు