హైదరాబాద్‌లో నలుగురు యువతుల అదృశ్యం, కలకలం

26 Apr, 2021 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు అదృశ్యమైన ఘటన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఆదివారం చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓల్డ్‌సఫిల్‌గూడ(మొఘల్‌ కాలనీ)కి చెందిన ఠాకూర్‌ రాజేశ్వరి(29) ఈనెల 24న భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. 

ప్రైవేట్‌ ఉద్యోగి..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన హరిష అలియాస్‌ పింకీ(25) ప్రైవేట్‌ ఉద్యోగి. ఈ నెల 22వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ ఘటనపై ఆమె సోదరుడు మహేష్‌ ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అనుమానాస్పద స్థితిలో స్టాఫ్‌ నర్స్‌ అదృశ్యం
బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న ఉదయశ్రీ(22) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఉదయశ్రీ గత కొంతకాలంగా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ నర్సుల హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 23న ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఉదయశ్రీ తిరిగి రాలేదు. ఇదే విషయాన్ని హాస్టల్‌ వార్డెన్‌ భాగ్యలక్ష్మి ఫోన్‌ ద్వారా ఉదయశ్రీ తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు శనివారం నగరానికి వచ్చి అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో కూతురు కనిపించడం లేదంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

మరో ఘటనలో..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా నెహ్రూనగర్‌కు చెందిన బాలయ్య భార్య కనకలక్ష్మి, కూతురు అరుణ(20) ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేస్తున్నారు. ఈ నెల 25న కనకలక్ష్మి తన పనిపూర్తి అయిన తర్వాత కూతురు పనిచేసే చోటుకు 9 గంటలకు వెళ్లింది. ఆ ఇంటి యజమాని అప్పటికే అరుణ వెళ్లిపోయింది అని చెప్పారు. ఆమె సెల్‌ఫోన్‌ పనిచేయకపోవడం, ఇంటికి రాకపోవడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పారిపోవడంలో కీలకంగా వ్యవహరించిన 19 ఏళ్ల ‘గర్ల్‌ఫ్రెండ్‌’

మరిన్ని వార్తలు