కి‘లేడీ’లు!.. ఏసీబీ అధికారులంటూ జ్యువెలరీ షాప్‌లోకెళ్లి..

25 Jul, 2022 14:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఇద్దరు కిలాడీ లేడీలు.. ఏసీబీ అధికారుల తరహాలో ఓ జ్యువెలరీలో హల్‌చల్‌ చేశారు. అక్కడి సిబ్బందిని హడలెత్తించారు. చివరకు ఆ ఇద్దరి చర్యలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళల మోసాన్ని బట్టబయలు చేశారు. తూత్తుకుడి పాత బస్టాండ్‌ రోడ్డులో ప్రముఖ వస్త్ర దుకాణంతో పాటుగా జ్యువెలరీ షోరూం ఉంది. ఇక్కడకు శనివారం సాయంత్రం టిప్‌ టాప్‌గా ఇద్దరు మహిళలు వచ్చారు. గంటన్నర పాటూ ఆ జ్యువెలరీలోనే గడిపి 10 సవర్ల బంగారాన్ని కొనుగోలు చేశారు. బిల్లు చెల్లించే క్రమంలో ఆ ఇద్దరు స్వరం మార్చారు.

ఆ జ్యువెలరీ యజమానిని పిలిపించాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. తాము ఏసీబీ అధికారులు అని పేర్కొంటూ గుర్తింపు కార్డులు చూపించారు. ఈ కిలాడీల బెదిరింపులకు అక్కడి సిబ్బంది కలవరపడ్డారు. చివరకు ఆ దుకాణం మేనేజర్‌ ఆ ఇద్దర్ని బుజ్జగించి జ్యూస్‌లు తెప్పించి ఇచ్చారు. యజమాని వస్తున్నారని పేర్కొంటూ, పోలీసుల్ని రప్పించారు. తూత్తుకుడి సెంట్రల్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అయ్యప్పన్‌ , సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరి మహిళల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు.

ఆ ఇన్‌స్పెక్టర్‌తో సైతం ఆ ఇద్దరు మహిళలు తాము ఉన్నతాధికారులు పేర్కొంటూ గదమాయించడం గమనార్హం. చివరకు ఆ ఇన్‌స్పెక్టర్‌ చాకచక్యంగా వ్యవహరించి తనకు కావాల్సిన ఏసీబీ అధికారుల ద్వారా వివరాలు రాబట్టారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆ ఇద్దరు మహిళలు అక్కడి నుంచి జారుకునే యత్నం చేశారు. చివరకు ఆ ఇద్దరు నకిలీ ఏసీబీ అధికారులుగా తేలింది. దీంతో మహిళా పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు. నిందితులు తూత్తుకుడికి చెందిన రాజలక్ష్మి (40), సేలం జిల్లా  ఎడపాడి పెరియకడైకు చెందిన పరమేశ్వరి (36)గా గుర్తించారు.  

మరిన్ని వార్తలు