లిఫ్ట్‌ వైరు తెగి ఇద్దరు కార్మికుల మృతి

19 Mar, 2023 05:04 IST|Sakshi

ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌లో దుర్ఘటన

మృతులు జార్ఖండ్‌ వాసులు

ఇబ్రహీంపట్నం: లిఫ్ట్‌ వైరు తెగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ (ఎన్టీటీపీఎస్‌) ప్రాంగణంలో జరిగింది. ఎన్టీటీపీఎస్‌లో నిర్మిస్తున్న 800 మెగావాట్‌ల విద్యుత్‌ ప్లాంట్‌లో పని చేసేందుకు ఉదయం 9గంటలకు కార్మికులు వచ్చారు. ప్లాంట్‌లోని 16వ చానల్‌ (అంతస్తు)లో పని చేసే కార్మికులు 20మంది కిందకు వచ్చేందుకు లిఫ్ట్‌ ఎక్కారు.

లిఫ్ట్‌ కిందకు వచ్చిన తర్వాత 18 మంది దిగారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులు చోటూ కుమార్‌సింగ్‌ (23), జితేంద్రసింగ్‌ (24) లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా, ఒక్కసారిగా డోరు మూసుకుపోయి మళ్లీ పైకి వెళ్లిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న 16వ చానల్‌కు వెళ్లిన తర్వాత లిఫ్ట్‌ వైరు తెగి కిందపడిపోయింది.

లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన చోటూ కుమార్‌సింగ్, జితేంద్రసింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సహచర కార్మికులు బయటకు తీసి ఎన్టీటీపీఎస్‌ బోర్డు వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఒకేసారి 20మంది రాకపోకలు సాగిస్తున్నారని, మెటీరియల్‌ కూడా దానిలోనే తరలిస్తున్నారని, అధిక బరువు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు.

భద్రత వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎన్టీటీపీఎస్‌ ప్లాంట్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులు ప్లాంట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సీఐ పి.శ్రీను నేతృత్వంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు