బీకాం చదివి..దొంగగా మారి

19 Aug, 2021 21:04 IST|Sakshi
దొంగలను మీడియా ముందు హాజరుపరచి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కేవీ మహేష్‌

కర్నూలు: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 107.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని నేరానికి ఉపయోగించిన పల్సర్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో సీఐలు కంబగిరి రాముడు, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌ తదితరులతో కలిసి డీఎస్పీ కేవీ మహేష్‌ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి దొంగల వివరాలు వెల్లడించారు.   

బీకాం చదివి..దొంగగా మారి:  
 ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రధాన నిందితుడు మాచర్ల శ్రీకాంంత్‌ బీకాం కంప్యూటర్స్‌ చదువుకుని బట్టల వ్యాపారం చేసేవాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు పేకాట, క్రికెట్‌ బెట్టింగులో పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. జల్సాల కోసం  ఇంటి దొంగతనానికి పాల్పడి మొదటిసారిగా ఆదోని సబ్‌ జైలుకు వెళ్లాడు. అప్పటికే తల్లి హత్య కేసులో అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న  రెండవ నిందితుడు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బోయ వీరేష్‌తో పరిచయం పెరిగింది. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత ఇరువురు కలిసి భారీ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు వీరేష్‌ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇద్దరూ కలిసి పగలు రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రిపూట ఇళ్లల్లో చొరబడి అందినకాడికి మూటగట్టుకుని ఉడాయించేవారు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించి విలాసవంతమైన జీవితం గడిపేవారు.  

పోలీసులకు చిక్కారు ఇలా:  
 శ్రీకాంత్, వీరేష్‌పై ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్‌లో పలు దొంగతనాల కేసులతోపాటు సస్పెక్ట్‌ షీట్లు ఉన్నాయి. దీంతో వారిపై అక్కడి పోలీసుల నిఘా పెరగడంతో కర్నూలులోని ముజఫర్‌ నగర్‌లో శ్రీకాంత్‌ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా వీరేష్‌తో కలిసి ఇళ్లల్లో  దొంగతనాలకు పాల్పడేవారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు బాలాజీ నగర్‌లో నివాసముంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు యజమాని పాటిల్‌ హనుమంతరెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉంచిన లాకర్‌ను ఎత్తుకెళ్లి ముజఫర్‌ నగర్‌లోని ఇంట్లో దాచి ఉంచారు. లాకర్‌ను తెరవడానికి సాధ్యం కాక మరో దొంగ సాయం కోరారు. లాకర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో తెరిస్తే వాటా ఇస్తామని ఆశ పెట్టారు.  ఈ విషయం పోలీసులకు  తెలియడంతో వారు నిఘాపెట్టి కర్నూలు శివారు సుంకేసుల రోడ్డులోని వై–జంక్షన్‌(తిప్పమ్మ కొట్టాల) వద్ద ఉండగా పట్టుకున్నారు. విచారణలో మరికొన్ని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు బయట పడింది.  
 
నేరాల చిట్టా ఇదీ.. 

కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఉద్యోగనగర్‌లో నివాసముంటున్న డాక్టర్‌ ప్రదీప్, సమీపంలో నివాసముంటున్న ఆనంద్‌ ఇళ్లల్లో జూలై 15వ తేదీన చోరీలకు పాల్పడ్డారు. అలాగే జనవరి 27వ తేదీన కోడుమూరులోని రాజశేఖర్‌ రెడ్డి ఇంట్లో 76 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు నగదును లూటీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తమ ప్రతిభను చూపి దొంగలను అరెస్ట్‌ చేయడమేగాక వారి వద్ద నుంచి భారీగా బంగారు నగలను రికవరీ చేసినందుకు ఏఎస్‌ఐలు కరీం, నబి, దేవరాజు, శ్రీనివాసులు, యల్లా శివుడు, తిక్కస్వామి తదితరులను డీఎస్పీ అభినందించారు.   

మరిన్ని వార్తలు