ఇంటర్‌నెట్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ సెర్చ్‌

7 Aug, 2020 08:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు యువకుల అరెస్ట్‌...

సాక్షి, హైదరాబాద్‌: బాలల అశ్లీలతకు సంబంధించిన అంశాలు, చిత్రాలు, వీడియోల కోసం ఇంటర్‌నెట్‌లో వెతికారంటే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీలోని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ (ఎస్‌సీఆర్‌బీ)లో ప్రత్యేక సెల్‌ కొనసాగుతోంది. గూగుల్‌లో చైల్డ్‌పోర్న్‌కు సంబంధించిన కీ వర్డ్స్‌ తో సర్చ్‌ చేసినా, బాలల అశ్లీలతకు సంబంధించిన వెబ్‌సైట్లలోకి వెళ్లినా వెంటనే ఈ సెల్‌ సదురు ఐపీ(ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌)ని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన ఐపీలను ఆయా రాష్ట్రాల్లోని సీఐడీ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఆయా నగరాలు, పట్టణాలకు ఆయా సమాచారాన్ని పంపించి, నిందితులను పట్టుకుంటున్నారు. ఇలా హైద్రాబాద్‌లో గురువారం ఇద్దరు యువకులను సిటీ సైబర్‌క్రైమ్‌ ఇన్స్‌పెక్టర్‌ మోహన్‌రావ్‌ బృందం అరెస్ట్‌ చేసింది.

తార్నాకకు చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌ వృత్తిరీత్యా ప్రైవేట్‌ ఉద్యోగి. అశ్లీల వెబ్‌సైట్లలోకి వెళ్లి బాలలకు సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేశాడు, వాటిని తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నాడు. అలాగే కాచిగూడకు చెందిన ప్రశాంత్‌కుమార్‌ ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అశ్లీల వెబ్‌సైట్లలోకి వెళ్లి అక్కడ బాలలకు సంబంధించిన అశ్లీల ఫోలోలను, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి వాటిని ఇతర సైట్లలో అప్‌లోడ్‌ చేశాడు. ఆయా ఐపీలను రికార్డ్‌ చేసిన ఎన్‌సిఆర్‌బీ వాటిని రాష్ట్ర సీఐడీకి పంపించింది. ఆ సమాచారం హైద్రాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు అందడంతో ఐపీ చిరునామాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా మరో 12 మందికి సంబంధించిన ఐపీలపై కూడా సైబర్‌క్రైమ్‌ పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఇంటర్‌నెట్‌లో శోధన చేసే వారికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఎన్‌సీఆర్‌బీకి ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ వాడేవారు ఈ కీవర్డ్స్‌ పై తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు