ప్రియుని కోసం.. కటకటాల్లోకి!

9 Jun, 2021 16:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఉడుపికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త భాస్కరశెట్టి(52) హత్య కేసులో భార్య, కొడుకు సహా ముగ్గురు దోషులకు జిల్లా సెషన్స్‌కోర్డు మంగళవారం యావజ్జీవ కారగారశిక్షను విధించింది. 2016 జులై 28న మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్రాళిలోని ఇంటిలో నుంచి ఆదృశ్యమయ్యారు. రెండురోజుల తరువాత ఆయన తల్లి మణిపాల్‌ పోలీసులకు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసింది. దుండగులు అతని శరీర భాగాలను సమీపంలో యజ్ఞకుండంలో వేసి దహనం చేశారు. అప్పట్లో ఈ కేసు కోస్తా జిల్లాల్లో తీవ్ర సంచలనం కలిగించింది.  

ఐదుగురు అరెస్టు..  
పోలీసులు ఘటనాస్థలిలో నుంచి నమూనాలను తీసుకుని డీఎన్‌ఏ నివేదికల ద్వారా అవి భాస్కరశెట్టికి చెందినవిగా గుర్తించారు. ఇంట్లోని వారే ఈ పనిచేశారని బయటపడింది. ఆయన భార్య రాజేశ్వరిశెట్టి (46), కొడుకు నవనీత్‌శెట్టి (23), రాజేశ్వరి ప్రియుడు, జోతిష్యుడు నిరంజన్‌భట్‌ (29), అతని తండ్రి శ్రీనివాస్‌భట్, కారు డ్రైవర్‌ రాఘవేంద్రలను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సుదీర్ఘకాలం పాటు విచారణ సాగుతూ వచ్చింది. నిందితులు కేసు నుంచి బయటపడడానికి హైకోర్టులో కూడా పిటిషన్లు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాజేశ్వరి ప్రస్తుతం బెయిలు మీద ఉండగా, నవనీత్, నిరంజన్‌ బెంగళూరు జైల్లో కస్టడీలో ఉన్నారు. శ్రీనివాసభట్‌ గతంలో అనారోగ్యంతో చనిపోయాడు.  

ఇదీ జరిగింది.. 
సౌదీ అరేబియాలో బడా వ్యాపారాలు చేసే భాస్కర్‌శెట్టికి ఉడుపిలో కూడా హోటళ్లు, లాడ్జ్‌లు వంటి పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఈ తరుణంలో జ్యోతిష్యం పేరుతో అతని భార్య రాజేశ్వరితో నిరంజన్‌భట్‌ కు అక్రమ సంబంధం ఏర్పడింది. పెద్దమొత్తంలో డబ్బులు స్వాహా చేయసాగాడు. ఈ విషయం తెలిసి భాస్కర్‌శెట్టి తన భార్యను తీవ్రంగా మందలించడంతో, ఇద్దరూ కలిసి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. భాస్కర్‌శెట్టి ఇంట్లో ఉండగా రాజేశ్వరి, నిరంజన్‌ భట్‌ కలిసి అతనిపై పెప్పర్‌స్ప్రే చల్లి ఇనుప రాడ్‌తో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అత్యంత కిరాతకంగా ఊపిరి ఉండగానే శరీరాన్ని ముక్కలు చేసి సమీపంలోని యజ్ఞకుండంలో పెట్రోలు పోసి కాల్చివేశారు. మిగిలిన భాగాలను తీసుకెళ్లి నదిలో కలిపేశారు. ఇందుకు రాజేశ్వరి కొడుకు, నిరంజన్‌భట్‌ తండ్రి కూడా సహకరించారు. హత్య జరిగిన 10 రోజులకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సీఐడీ విభాగం కేసును విచారించి 1,300 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమ ర్పించింది.  

తీర్పు..  
జిల్లా సెషన్స్‌కోర్డు జడ్జి జె.ఎన్‌.సుబ్రమణ్య కేసును విచారించి తీర్పునిచ్చారు. డ్రైవర్‌ రాఘవేంద్రపై ఆధారాలు లేకపోవడంతో విముక్తున్ని చేశారు. భార్య, కొడుకు, జ్యోతిష్యునికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

చదవండి: 
తీవ్ర విషాదం: ఏం జరిగిందో.. ఆ తల్లి పిల్లలతో సహా..

‘నేను నపుంసకుడిని.. తొలి రేయిలోనే భార్యకు షాక్‌’

మరిన్ని వార్తలు