కోడలిని బయటకు నెట్టిన అత్త, మామ 

12 Oct, 2020 10:43 IST|Sakshi
కుమారుడితో బాధితురాలు మద్దినేని హరిణి

సాక్షి, జే.పంగులూరు: తన భర్త పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటానని అత్తారింటికి వెళ్లిన కోడలిని, ‘‘నీవు మాకు పనికిరావు, మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ’’అత్త, మామ, బావలు కలసి కొట్టి బలవంతంగా బయటకు నెట్టేసిన సంఘటన మండలంలోని నూజిళ్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. 11 నెలల బిడ్డను పట్టుకొని వర్షంలో ఎటు వెళ్లాలో తెలియక, ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ రానివ్వక, వర్షంలోనే తడుస్తూ తన భర్త తనకు కావాలని,  కాపురం నిలబెట్టాలని వేడుకుంది. అయినా భర్తతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో పుట్టింటికి చేరింది. బాధితురాలు మద్దినేని హరిణి అందించిన వివరాలు ప్రకారం మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన నాగుబోయిన ఆంజనేయులు కుమార్తె హరిణిని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన మద్దినేని శ్రీనివాసరావు కుమారుడు సుధీర్‌కి ఇచ్చి ఏడు సంవత్సరాలు క్రితం వివాహం చేశారు.

వారికి ఆరేళ్ల వయసున్న కుమారుడు చరణ్‌ శ్రేదీప్, మరో 11 నెలల వయసున్న బాబు ఉన్నారు.  ప్రస్తుతం బాధితురాలు గ్రామంలోనే వలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. ఏడాది క్రితం అత్తమామలకు రెండు లక్షలు అప్పు కావాలంటే తన తండ్రితో మాట్లాడి వడ్డీకి రెండు లక్షలు తెచ్చి ఇచ్చింది. రెండు మూడు నెలల్లో తీసుకున్న డబ్బులు ఇస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇవ్వక పోవటంతో మా అత్తమామలను డబ్బులు అడిగింది. దీంతో ఆగస్టు 25 వ తేదీ మా అత్తమామ, బావలు  భర్తతో కొట్టించి ఇంటిలో నుంచి బయటకు నెట్టేశారు. నెల రోజుల క్రితం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు, గ్రామ పెద్దలు నచ్చచెప్పి 15 రోజులు ఓపిక పడితే అత్తగారింటికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో బాధితురాలు వెనక్కు వచ్చింది.

నెల రోజులైనా అత్తగారి ఇంటికి తీసుకొని వెళతామని చెప్పిన పెద్ద మనుషులు రాలేదు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఆదివారం 11 నెలల బాబుతో అత్తగారి ఇంటికి వచ్చింది. దీంతో అత్త అంజమ్మ, మామ శ్రీనివాసరావు, బావ గురుస్వామి దుర్భాషలు ఆడి ఇంటి నుంచి బయటకు నెట్టేసి, ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదని నీ దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోమంటూ తన్ని బయటకు నెట్టేశారు. వర్షంలో చేసేది లేక బాధితురాలు 11 నెలలు బాబును ఎత్తుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు భర్త కావాలని చెప్తున్నా ఎవ్వరూ వినటంలేదని, పోలీస్‌ స్టేషన్‌లో గాని, ఊరి పెద్ద మనుషులతో గానీ న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు