మరో మహిళతో ఆర్‌ఎంపీ సహజీవనం, విషయం తెలిసి భార్య ఇంటికి రావడంతో..

8 May, 2022 17:15 IST|Sakshi
మామ, భర్త దాడితో తీవ్రంగా గాయాలైన హసీనా

పెదకూరపాడు(అచ్చంపేట)పల్నాడు జిల్లా కోడలిపై మామ, భర్త దాడిచేయగా, విషయం తెలియడంతో కోడలి బంధువులు ప్రతిదాడి చేసిన ఘటన అచ్చంపేట మండల పరిధిలోని క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ హసన్‌ తన కుమారుడు జానీబాషాకు నాలుగేళ్ల క్రితం మేనకోడలు షేక్‌ హసీనాను ఇచ్చి వివాహం చేశారు. రెండేళ్ల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో హసీనా పుట్టింట్లో ఉంటోంది. ఆర్‌ఎంపీగా పనిచేసే భర్త జానీబాషా హైదరాబాద్‌లో మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.
చదవండి: ప్రేమ పేరుతో ఎస్‌ఐ వంచన

ఈ విషయం తెలిసిన హసీనా తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటికి రావడంతో మామ హసన్‌ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో హసీనా అచ్చంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అత్తమామలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన జానీబాషా ఇంట్లో ఉన్న భార్యపై తండ్రి సహాయంతో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న హసీనా కుటుంబ సభ్యులు హసన్‌ ఇంటికి వచ్చి భర్త జానీబాషా, హసన్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ మణికృష్ణ తెలిపారు. 

మరిన్ని వార్తలు