AP Crime: కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా 

16 Sep, 2022 15:08 IST|Sakshi
విడియాల మోహన్‌గాంధీ(ఫైల్‌)

రాయవరం(కోనసీమ జిల్లా): ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి. రాయవరం మండలం పసలపూడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంధ్యం సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. అదే ప్రమాదంలో గాయపడిన సుబ్రహ్మణ్యం అల్లుడు మాచవరం గ్రామ వలంటీర్‌ విడియాల మోహన్‌గాంధీ(26) గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చదవండి: స్కూల్‌ బస్‌ మిస్‌.. బైక్‌లో తీసుకెళ్తుండగా

కనిపెంచిన తండ్రిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం చేసి దేవుడా.. ఎంత శిక్ష వేసావయ్యా అంటూ మోహన్‌గాం«ధీ భార్య విజయదుర్గా భవాని బోరున విలపిస్తుంది. ఇక తనకు దిక్కెవరు అంటూ ఆమె విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆస్పత్రి నుంచి భర్త క్షేమంగా వస్తాడనుకున్నంతలోనే చావు కబురు వినాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన చెందింది.

ఇదిలా ఉంటే వారం రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకుని ఒక పక్క భర్త సుబ్రహ్మణ్యం, మరో పక్క అల్లుడు మోహన్‌గాం«దీని కోల్పోయిన సుబ్రహ్మణ్యం భార్య వెంకటలక్ష్మి మౌనంగా రోదిస్తుంది. మృతుడు మోహన్‌గాంధీకి నిత్య, చైతన్య వర్షిణి చిన్నారులున్నారు. మోహన్‌గాంధీ తండ్రి శ్రీనివాస్‌ తాపీ మే్రస్తిగా పనిచేస్తూ గతేడాది భవనంపై నుంచి పడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. గత నెలలో శస్త్ర చికిత్స చేయించుకున్న మృతుడు మోహన్‌గాంధీ తల్లి అరుణ నడవలేని స్థితిలో ఉంది. సౌమ్యుడిగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్‌గాంధీ మరణం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రోజు వ్యవధిలో మామాఅల్లుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

మరిన్ని వార్తలు