అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్‌ దహనం

11 Apr, 2022 07:50 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: అత్తమీద కోపం దుత్తమీద చూపించిందనే సామెతను తలపించిందీ ఘటన. అల్లుడి మీద కోపంతో ఆయన స్నేహితుడి బైక్‌ను దహనం చేసిన మామపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఫస్ట్‌ బెటాలియన్‌ ప్లాట్‌ నంబర్‌ 522 వద్దకు జగద్గిరిగుట్టలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఎం.పాండు తన స్నేహితుడు శ్రీనివాస్‌ను కలిసేందుకు శుక్రవారం రాత్రి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి ఇంటి బయట ఇసుకలోనే నిద్రించారు.

అదే సమయంలో శ్రీనివాస్‌ మామ నాగయ్య తన అల్లుడి మీద కోపంతో స్నేహితుడు పాండు అక్కడ పార్కింగ్‌ చేసిన బైక్‌ను పెట్రోల్‌ పోసి దహనం చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకొని శబ్దాలు రావడంతో మెలకువ వచ్చిన పాండు అక్కడికి వెళ్లి చూడగా బైక్‌ మంటలో కాలిపోతోంది. అక్కడి నుంచి నాగయ్య వస్తూ కనిపించాడు. తన బైక్‌ను కాల్చివేసిన నాగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

(చదవండి: ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ)

మరిన్ని వార్తలు