కోరిక తీర్చడం లేదని కోడలిని చంపిన మామ

6 Jan, 2022 03:13 IST|Sakshi
భూక్య రజిత (ఫైల్‌) 

కోడలి గొంతు కోసి చంపిన మామ

తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు

నిందితుడి ఇంటిని ధ్వంసం చేసేందుకు మృతురాలి బంధువుల యత్నం

గడ్డివాములు దహనం

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

కురవి: లైంగిక కోరిక తీర్చాలని మూడేళ్లుగా వెంటపడుతున్నా ఆమె తిరస్కరిస్తుండటంతో కక్ష పెంచుకుని కోడలి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ మామ. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లాతండాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలంలోని జుజూర్‌ తండాకు చెందిన బోడ చంద్రు కుమార్తె రజిత (30)ను 12 సంవత్సరాల క్రితం సోమ్లాతండాకు చెందిన భూక్యా హచ్చ కుమారుడైన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ముత్యాలమ్మగూడెంలోని గురుకులంలో చదువు కుంటున్నారు. ఈ క్రమంలోనే 63 ఏళ్ల వయసు ఉన్న మామ భూక్యా హచ్చా.. కోడలు రజితను తన కోరిక తీర్చాలని మూడేళ్లుగా వెంట పడుతున్నాడు. ఈ విషయాన్ని రజిత తన తల్లి దండ్రులతో చెప్పగా వారు పలుమార్లు హచ్చను మందలించారు. ఈ నేపథ్యంలో రజితపై కక్ష పెంచుకున్న హచ్చ, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత తలపై రేంజ్‌స్పానర్‌(అడ్జస్ట్‌మెంట్‌స్పానర్‌)తో గట్టిగా బాదాడు.

ఆ తరువాత కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారిం చుకున్న తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కోడలిని తనే చంపినట్లు హచ్చ పోలీసులకు చెప్పి నట్లు తెలిసింది. మృతు రాలి తండ్రి చంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాణా ప్రతాప్‌ తెలిపారు. కాగా, హత్య సమయంలో రజిత భర్త కూలి పనికి వెళ్లినట్లు తండా వాసులు తెలిపారు. 

తండాలో తీవ్ర ఉద్రిక్తత..
రజిత హత్య విషయం తెలుసుకున్న బంధువులు ఆగ్రహంతో సోమ్లాతండాకు వచ్చారు. ఇంటి వద్ద నిందితుడు హచ్చ లేకపోవడం, అల్లుడు కూడా లేకపోవడంతో కోపోద్రిక్తులై ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కురవి ఎస్సై రాణాప్రతాప్, రూరల్‌ సీఐ రవికుమార్‌లు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని తరలించడానికి వారు అంగీకరించలేదు. భూక్యా హచ్చ, మృతురాలి భర్తను తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్లనిస్తామని పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని బలవం తంగా ట్రాక్టర్‌లో వేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించారు. 

గడ్డివాములు దహనం..
పోలీసులు బలవంతంగా రజిత మృతదేహాన్ని తీసుకెళ్లడంతో ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మృతురాలి సోదరి ఒకరు హచ్చకు చెందిన గడ్డివాములకు నిప్పుపెట్టింది. మంటలు చెలరేగడంతో సీరోలు ఎస్సై సంతోష్‌రావు మంటలను ఆర్పేయత్నం చేసినా ఫలితంలేకుండా పోయింది. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో తండాలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు