హత్యచేసి కాల్చేశారు..!

1 May, 2022 13:11 IST|Sakshi

డెంకాడ: డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ పరిధి (విజయనగరం–కుమిలి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సమీపం) దయాల్‌నగర్‌ సమీపంలో గుర్తుతెలియని మహిళపై పెట్రోల్‌ పోసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 18–21 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు డెంకాడ పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందించడంతో డీఎస్పీ అనిల్‌కుమార్, భోగాపురం సీఐ విజయానంద్, డెంకాడ ఎస్‌ఐ పద్మావతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సైతం నేర స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  

క్లూస్‌ టీం, డాగ్‌స్వా్కడ్‌ పరిశీలన...  
మహిళ మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించింది. ఆధారాలు సేకరించింది. డాగ్‌   స్వా్కడ్‌ బేతనాపల్లి బస్సుషెల్టర్‌ వరకూ వెళ్లి ఆగింది. ఘటనకు సంబంధించిన వారు అక్కడ ఆగారా, లేదంటే బాధిత మహిళ అక్కడ వేచిఉందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయనగరం–కుమిలి రోడ్డులో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి దహనంచేసిన ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

గతంలోనూ..  
గతంలోనూ ఎక్కడో హత్యచేసిన వ్యక్తిని ఇక్కడకు తెచ్చి పడేశారు. గుణుపూరుపేట డంపింగ్‌యార్డు సమీపంలో కూడా ఇలాంటి ఘటనే గతంలో చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాత్రివేళలో పెట్రోలింగ్‌ను పెంచుతామని ఎస్పీ తెలిపారు. రాత్రి సమయంలో కొందరు అనవసరంగా ఇక్కడ సంచరిస్తున్నట్టు గుర్తించామన్నారు. దీనిని నివారించేలా నిఘా పెంచుతామని చెప్పారు.

(చదవండి: సారా ప్యాకింగ్‌ కేంద్రాలపై దాడులు)

మరిన్ని వార్తలు