ఔను.. నేనే ఇచ్చా!.. నేరం అంగీకరించిన మస్తాన్‌వలీ

22 Jan, 2022 03:55 IST|Sakshi

‘గిడ్డంగుల’ కేసులో నేరం అంగీకరించిన మస్తాన్‌ వలీ 

అసలు ఎఫ్‌డీ బాండ్లు మరో నిందితుడికి అప్పగించిన వైనం 

నకిలీవాటిని గిడ్డంగుల శాఖకు చేర్చిన నిందితులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీ) కాజేసేందుకు జరిగిన కుట్రలో తానూ పాత్రధారినే అని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీ నేరం అంగీకరించాడు. ‘తెలుగు అకాడమీ’కేసులో జైల్లో ఉన్న అతడిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలోనే తన నేరం అంగీకరించడంతోపాటు వెంకటరమణ పేరు బయటపెట్టాడు.

ఎఫ్‌డీ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్న సాయికుమార్‌కు ప్రధాన అనుచరుడైన వెంకటరమణే గిడ్డంగుల సంస్థకు, కార్వాన్‌ యూనియన్‌ బ్యాంక్‌ శాఖకు మధ్య దళారిగా వ్యవహరించాడు. ఆ సంస్థ నుంచి రూ.3.98 కోట్ల చెక్కులు తీసుకెళ్లి మస్తాన్‌ వలీకి ఇచ్చాడు. అతడిచ్చిన అసలు బాండ్లను తీసుకెళ్లిన రమణ, వాటి స్థానంలో నకిలీవాటిని గిడ్డంగుల సంస్థకు అప్పగించాడు. తెలుగు అకాడమీసహా ఇతర స్కాముల మాదిరిగా సాయికుమార్‌ నేతృత్వంలోనే ఈ స్కామ్‌ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

దీన్ని అధికారికంగా నిర్ధారించడానికి వెంకటరమణను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఈ కేసులోనూ చెన్నైకి చెందిన పద్మనాభన్‌ ఈ నకిలీ బాండ్లు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్‌ మంజూరైనప్పటికీ ష్యూరిటీల తంతు పూర్తికాకపోవడంతో వెంకటరమణ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారి, ఏసీపీ మనోజ్‌కుమార్‌ నిర్ణయించారు. మస్తాన్‌ వలీని విచారిస్తే ఈ కుట్రలో సాయి సహా ఇతరుల పాత్ర బయటకు వస్తుందని భావిస్తున్నారు.    

>
మరిన్ని వార్తలు