రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు

12 Jan, 2021 06:16 IST|Sakshi
శ్రీపాద దంపతులు (ఫైల్‌)

మంత్రి శ్రీపాద యశోనాయక్‌ భార్య దుర్మరణం

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ఆయుష్, యునానీ, హోమియోపతి మంత్రి శ్రీపాద యశోనాయక్‌ కారు సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భార్య విజయ నాయక్, వ్యక్తిగత సహాయకుడు(పీఏ) దీపక్‌ మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రితో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్‌ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

అతివేగంగా వెళ్తున్న మంత్రి కారు అంకోలా తాలూకా హోసకంబి వద్దకు రాగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో పల్టీ కొట్టింది. ఈ సమయంలో కారులో శ్రీపాద నాయక్, ఆయన భార్య, పీఏ దీపక్, అనుచరుడు సాయికిరణ్, గన్‌మ్యాన్, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందారు. గాయపడిన మంత్రిని గోవాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌కు ఫోన్‌ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాద నాయక్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  

మంత్రిని గోవాకు తరలిస్తున్న దృశ్యం.


ప్రమాదంలో ధ్వంసమైన కారు

మరిన్ని వార్తలు