సీపీఐ కార్యాలయంపై దాడి

14 Sep, 2020 04:30 IST|Sakshi
చాడ, నారాయణతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్న నారాయణగూడ పోలీసు అధికారి

రాష్ట్ర కార్యదర్శి చాడ కారు అద్దాలు ధ్వంసం 

బైక్‌పై వచ్చి దాడికి దిగిన ఇద్దరు యువకులు

సంఘ విద్రోహ చర్య: నారాయణ, చాడ

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) కేంద్ర కార్యాలయం (మఖ్దూం భవన్‌)పై ఆగంతుకులు దాడి చేశారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పల్సర్‌ వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాచ్‌మేన్‌ సురేంద్రను తెలుగు అకాడమీ అడ్రస్‌ అడిగారు. పది నిమిషాలు అక్కడే తచ్చాడి ఆపై దాడికి పాల్పడ్డారు. కర్ర,  రాళ్లతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇన్నోవా కారుపై దాడి చేశారు. దీంతో కారు ముందు అద్దం, ఎడమవైపు అద్దాలు ధ్వంస మయ్యాయి. కార్యాలయం బయట పార్క్‌ చేసి ఉన్న మరో కారుపై కూడా  దాడి చేశారు. అనంతరం వాచ్‌మేన్‌పై కర్రతో దాడి కి యత్నించగా ఆయన బిగ్గరగా కేకలు వేశా డు. వారు మినర్వా కాఫీషాప్‌ వైపు వెళ్లిపోయారు.

కేసు నమోదు..
సమాచారం తెలుసుకున్న ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కార్యాలయానికి చేరుకుని పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.  నారాయణగూడ పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, యువకుల కోసం మూడు బృందాలు గాలింపు చేపట్టాయని ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు.

ఆకతాయిల పని కాదు..
ప్రజల పక్షాన నిలబడి పోరాడే తమకు ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తాము ఎండగడుతున్న కారణంగానే దాడి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దాడిపై లోతైన విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
ధ్వంసమైన చాడ వెంకటరెడ్డి కారు అద్దాలు

మరిన్ని వార్తలు