చికిత్స కోసం ఆస్పత్రికి.. చనిపోయిందనడంతో తీసుకొచ్చినవారు పరార్‌

18 Jul, 2021 10:44 IST|Sakshi

దుండిగల్‌: అపస్మారక స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తులు తీరా ఆమె చనిపోయిందని తెలియడంతో పరారైన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 16న రాత్రి 10:25 గంటల సమయంలో సూరారంలోని నారాయణ మలారెడ్డి ఆస్పత్రికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఓ మహిళను చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వారి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది శనివారం దుండిగల్‌ పోలీçసులకు ఫిర్యాదు చేశారు.

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఆటోలో వెళ్లిపోయినట్లు కనిపించింది. స్పష్టత లేకపోవడంతో సదరు వ్యక్తులను గుర్తించలేకపోయారు. మహిళ ఎడమ చేతిపై లక్ష్మి, కుడి చేతిపై ‘ఎం’ అనే అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయని, మెడలో మంగళసూత్రం, చేతులు, కాళ్లకు పారాణి ఉండటంతో కొత్తగా పెళ్లై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని, కుటుంబ గొడవల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందా లేదా ఇతరాత్రా కారణాలతో మృతి చెంది ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులెవరైనా ఉంటే దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు