మామ ఆత్మహత్య కేసులో అల్లుడు అరెస్ట్‌

10 Aug, 2020 08:29 IST|Sakshi
డి.బాబుల్‌రెడ్డి, శ్వేత, సాయి (ఫైల్‌ ఫొటోలు)

వివాహేతర సంబంధంతోనే భార్యకు వేధింపులు

సాక్షి, ప్రొద్దుటూరు: పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీకి చెందిన ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి అతని అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డిని రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 7న సాయంత్రం అతను బైపాస్‌రోడ్డులోని ఒక వెంచర్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి అతని మేనల్లుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక బాబుల్‌రెడ్డి కుమార్తెలు శ్వేత, సాయిప్రీతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

రూరల్‌ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌రెడ్డి ఏడాది కిందట బాబుల్‌రెడ్డి పెద్ద కూతురు శ్వేతను వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మోసం చేయడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలోనే పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని భార్యను వేధించేవాడు. అంతేగాక మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని 9 నెలలుగా భార్య శ్వేతను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. (తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య)


కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ విశ్వనాథ్‌రెడ్డి 

కూతురు కాపురాన్ని చక్కబెట్టాలని ప్రయత్నం చేసినా..
కుమార్తె శ్వేత కాపురం ఎందుకిలా అయిందని తండ్రి రోజు మదన పడేవాడు. ఆమె కాపురాన్ని చక్కపెట్టేందుకు ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందేవాడు. ఎన్నిసార్లు పంచాయితీ  చేసినా అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డి వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అతను ఆత్మహత్యకు పాల్పడే కొన్ని నిమిషాల ముందు తన వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌తోసెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డి కారణమని, జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని  సురేష్‌కుమార్‌రెడ్డిని ఖాదర్‌బాద్‌ సమీపంలో అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు అతన్ని రిమాండుకు పంపిస్తున్నామని వివరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు