క్షణికావేశం.. ఇక ఆ పిల్లలకు దిక్కెవరు..

11 Aug, 2020 12:53 IST|Sakshi
అమ్మానాన్నల పెళ్లి ఫోటోలను చూస్తున్న చిన్నారులు, ఇన్‌సెట్‌లో లక్ష్మణరావు, పావని

డీజేపురం సంఘటనలో పిల్లల పరిస్థితి అయోమయం

హత్యకు గురైన తండ్రి, జైలుకు వెళ్లిన తాత 

అమ్మమ్మే ఆసరా

సాక్షి, తూర్పుగోదావరి: పది నెలల క్రితం తల్లి ఆత్మహత్య చేసుకుంది, మద్యానికి బానిసైన తండ్రి హత్యకు గురయ్యాడు, ఇప్పటి వరకూ సాకుతున్న తాత జైలు పాలయ్యాడు. అమ్మమ్మే ఆ ఇద్దరు పిల్లలకు దిక్కయ్యింది. రౌతులపూడి మండలం డీజేపురంలోని చిన్నారుల దీనగాథ ఇది. వివరాల్లోకి వెళితే.. డీజే పురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ, రమణమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో పెద్దకుమార్తె పావనికి శంఖవరం మండలం గొంది అచ్చంపేటకు చెందిన పంపన బోయిన లక్ష్మణరావు (31)తో 2015 మార్చి 7వ తేదీన వివాహం చేశారు. వీరికి నాలుగేళ్ల రేఖాశివసింధు, రెండేళ్ల కావ్యశ్రీ సంతానం. తాగుడుకు బానిసైన లక్ష్మణరావు రోజూ భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులు తాళలేక పావని పదినెలల క్రితం అచ్చంపేటలో ఆత్మహత్య చేసుకుంది. అనంతరం లక్ష్మణరావు తన పిల్లలను అత్తవారింటికి పంపించేశాడు. అప్పటినుంచీ తాతయ్య, అమ్మమ్మ దగ్గర వారు పెరుగుతున్నారు.  (మహిళపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం!)

అల్లుడిపై అనుమానం 
తమ కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని సత్యనారాయణ, రమణమ్మ అనుమానం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో శనివారం అచ్చంపేట వెళ్లిన సత్యనారాయణ తన అల్లుడిని వెంట తీసుకువచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న అల్లుడితో ‘పిల్లలను ఎందుకు పంపించేశావు’ అని ప్రశ్నించాడు. ‘ నాకు మరో వివాహం చెయ్యి, లేకుంటే పిల్లలను కూడా నీ కూతురిని చంపినట్లే చంపేస్తాను’ అని లక్ష్మణరావు గునపం తీసి బెదిరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ పక్కనే ఉన్న కత్తితో అల్లుడిని హత్య చేసి మొండెం నుంచి తలను వేరు చేశాడు. మరుసటి రోజు ఉదయం తలను ఒక సంచిలో వేసుకుని  వెళ్లి అన్నవరం పోలీ సు స్టేషన్‌లో లొంగిపోయాడు.  

పిల్లలను ఎలా సాకాలో? 
సత్యనారాయణ కూలీనాలీ చేసి ఇద్దరు మనుమరాళ్లను పోషించేవాడు. అల్లుడిని చంపి అతడు జైలుకు వెళ్లడంతో రమణమ్మ బోరున విలపిస్తోంది. పిల్లలను ఎలా సాకాలంటూ కన్నీరుమున్నీరవుతోంది. గ్రామంలో ఉన్న కొద్దిపాటి కొండపోడు భూమిని తన నలుగురు పిల్లలకు పంచామని, కూలి పని చేసుకుంటూ తన అత్తను, మనవరాళ్లను పెంచుకుంటున్నామని చెప్పింది. ఇప్పుడు భర్త జైలుకు వెళ్లడంతో ఆమె ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది.  

ఫొటో ఆల్బమ్‌ చూస్తూ.. 
అభం శుభం తెలియని ఆ చిన్నారులిద్దరూ తమ తల్లిదండ్రుల పెళ్లినాటి ఆల్బమ్‌ చూస్తూ ఆడుకుంటున్నారు. అమ్మ ఇదిగో.. నాన్న ఇడుగో అంటూ చెప్పుకుంటున్నారు. నాన్న ఇక రాడని, తాత జైలు కెళ్లాడన్న విషయం తెలియక అమాయకంగా చూస్తున్నారు.  (అల్లుడిని నరికి చంపి, తలను తీసుకొని)


హత్యకు గల కారణాలను విలేకరులకు వివరిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు, చిత్రంలో నిందితుడు సత్యనారాయణ (ముసుగు వేసిన వ్యక్తి)   

అల్లుడి తల నరికిన మామ అరెస్ట్‌ 
అన్నవరం: రౌతులపూడి మండలం ధార జగన్నాథపురం (డీజే పురం)గ్రామంలో ఆదివారం జరిగిన పంపనబోయిన లక్ష్మణరావు హత్యకు సంబంధించి అతడి మామ పల్లా సత్యనారాయణను అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. తన కుమార్తె పావనిని అల్లుడు లక్ష్మణరావు చంపి ఉంటాడని పల్లా సత్యనారాయణ అనుమానం పెంచుకున్నాడు. బట్టలు పెట్టాలంటూ అల్లుడిని ఇంటికి పిలిచాడు. శనివారం రౌతులపూడి వచ్చిన అల్లుడిని తన మోటారు సైకిల్‌పై డీజే పురానికి తీసుకువచ్చాడు.

పిల్లలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆదివారం అల్లుడిని ప్రశ్నించాడు. ‘నాకు రెండో పెళ్లి చేస్తేనే వాళ్లను చూస్తాను, లేకపోతే నీ కూతురుని చంపినట్టే వాళ్లనూ చంపేస్తాను’ లక్ష్మణరావు బెదిరించాడు. తన అనుమానం నిజం కావడంతో సత్యనారాయణ ఆగ్రహంతో ఊగిపోయాడు. చెట్టు కొమ్మలు నరికే కత్తితో అల్లుడి పీక నరికి తల, మొండం వేరు చేశాడు. తల సంచిలో వేసుకుని అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా.. నిందితుడు సత్యనారాయణను అరెస్ట్‌ చేసి ప్రత్తిపాడు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ రాంబాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు