ఉప్పల్‌ జంట హత్య కేసులు: ఆరేళ్లుగా పగబట్టి పూజారి సహా కుమారుడి అంతం

19 Oct, 2022 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్షుద్ర పూజలు చేసినా పోలీసు ఉద్యోగం రాలేదు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులూ వెంటాడటంతో కక్షగట్టి ప్రాణాలు తీశాడని రాచకొండ పోలీసులు తేల్చేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఉప్పల్‌ జంట హత్యల కేసును ఎట్టకేలకు ఛేదించారు. ప్రధాన నిందితుడు లక్కీ వినయ్‌ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. మంగళవారం ఆయన మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ మురళీధర్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 

  • 1991లో బాలాపూర్‌లోని మామిడిపల్లికి చెందిన లక్కీ వినయ్‌ తండ్రి పర్మ యోగేందర్‌ రెడ్డి రాజకీయ కక్షల నేపథ్యంలో తుకారాంగేట వద్ద హత్యకు గురయ్యారు. అనంతరం లక్కీ, అతడి అన్న, సోదరితో కలిసి ఉప్పల్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు.  ఇక్కడి హనుమాన్‌సాయినగర్‌కు చెందిన పురోహితుడు నర్సింహ శర్మతో లక్కీకి పరిచయమైంది. ఈ క్రమంలో నర్సింహకు అతీత శక్తులున్నాయని, పూజలతో ఏదైనా సాధించగలడని అతడు నమ్మకం పెంచుకున్నాడు. 
  • 2016లో ఎస్‌ఐ పరీక్షకు లక్కీ హాజరయ్యాడు. ఆ సమయంలో నర్సింహా పూజలు చేసి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానంటూ కిస్మత్‌పురాకు చెందిన వాలి, రాజ్యలక్ష్మీలకు రూ.12.50 లక్షలు ఇప్పించాడు. ఈ నేపథ్యంలో పూజలు చేసినా ఎస్‌ఐ ఉద్యోగం రాకపోవటంతో తాను ఇచి్చన డబ్బులు తిరిగి ఇవ్వాలని నర్సింహపై లక్కీ ఒత్తిడి పెంచాడు. నర్సింహ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరిగేవాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం, అనారోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులకు లోనుకావటంతో.. పూజారి నర్సింహ క్షుద్ర పూజల కారణంగానే తాను దీన స్థితికి వచ్చానని లక్కీ భావించాడు. నర్సింహను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 

రక్తం మరకలు.. దుస్తులను శుభ్రం చేసిన తల్లి.. 
జంట హత్యల అనంతరం నిందితులు లక్కీ, బాలకృష్ణలు తప్పించుకునేందుకు జల్‌పల్లికి చెందిన గడ్డి కార్తీక్, ఎల్బీనగర్‌కు చెందిన వాకిటి సుధాకర్‌ రెడ్డిలు రూ.35 వేలు కమీషన్‌ తీసుకొని రెండు ద్విచక్ర వాహనాలను సమకూర్చారు.  హత్యల అనంతరం రక్తం మరకలున్న దుస్తులు, కత్తి, కొడవలిని మామిడిపల్లిలోని  లక్కీ ఇంట్లో వదిలేసి పారిపోయారు. లక్కీ తల్లి సావిత్రి రక్తపు మరకలు కనిపించకుండా దుస్తులను శుభ్రం చేసింది. నర్సింహ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రక్తం మరకులున్న దుస్తులు, కత్తి, కొడవలి, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

హాస్టల్‌లో నక్కి.. రెక్కీ 
లక్కీ తన స్నేహితుడైన చంపాపేటకు చెందిన యెళ్ల బాలకృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. నర్సింహ కదలికలను పసిగట్టేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్‌ గదిని అద్దెకు తీసుకున్న మామిడిపల్లికి చెందిన లాల్‌ జగదీష్‌ గౌడ్, కార్వాన్‌కు చెందిన గన్వయ రామ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన గైక్వాడ్‌ శ్యాం సుందర్‌లు రెక్కీ చేసి సమాచారాన్ని లక్కీకి  చేరవేసేవారు. సరైన సమయం కోసం వేచి ఉన్న లక్కీ, బాలకృష్ణలు శుక్రవారం తెల్లవారుజామున కొడవలి, కత్తులతో నర్సింహ ఇంట్లోకి ప్రవేశించి అతడిని హత్య చేశారు. తిరిగి వెళ్లిపోతుండగా నర్సింహ చిన్న కుమారుడు శ్రీనివాస్‌ అడ్డుకోవటానికి ప్రయతి్నంచగా.. అతడినీ బాలకృష్ణ కత్తితో పొడిచి చంపేశాడు.   

(చదవండి: 'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితా­న్ని చాలిస్తున్నా')

మరిన్ని వార్తలు