‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’.. మూడు మార్కులు తక్కువ..

10 Sep, 2022 08:35 IST|Sakshi
యువతి సారా నేపాలి, సంఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి పాతపట్నం బాలాజీ నగర్‌కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది.

కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్‌ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్‌ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు.
చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు

అక్కడ సూసైడ్‌ నోట్‌తో పాటు సెల్‌ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు.  సూసైడ్‌ నోట్‌లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్‌ బహదూర్‌ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు