కీచక గురువుకు జీవిత ఖైదు

28 Oct, 2020 14:46 IST|Sakshi

న్యూయార్క్‌ : తనకు తాను గురువుగా ప్రకటించుకుని లైఫ్‌ కోచింగ్‌ పేరుతో మహిళలను సెక్స్‌ బానిసలుగా మార్చి​ లైంగిక వాంఛలను తీర్చుకున్నారనే అభియోగాలపై కీత్‌ రనీర్‌ (60)కు న్యూయార్క్‌ జడ్జి మంగళవారం 120 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. లైఫ్‌ కోచింగ్‌ సంస్థ నెక్సిమ్‌ నేతగా సంపన్నులు, ప్రముఖుల కోటరీని ఆకర్షించిన కీత్‌ రెనీర్‌కు మహిళలను తనతో బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి చేసినట్టు రుజువు కావడంతో జడ్డి జీవిత ఖైదు విధించారు. ఐదు రోజుల సెల్ప్‌ హెల్ప్‌ కోర్సుల కోసం ఒక్కొక్కరి వద్ద 5000 డాలర్లను ఈ సంస్థ వసూలు చేస్తుంది. కోర్సు వ్యవధిలో మహిళలను కీత్‌ రనీర్‌ శారీరకంగా లోబరుచుకుని వారితో కఠినమైన ఆహార నియమాలను పాటించేలా ఒత్తిడి చేస్తాడని వెల్లడైంది.

శిష్యుల నుంచి మహిళలతో డీఓఎస్‌ పేరిట పిరమిడ్‌ గ్రూపును ఏర్పాటు చేసి వారిని సెక్స్‌ బానిసలుగా మార్చి తాను గ్రాండ్‌ మాస్టర్‌గా వారితో లైంగిక సంబంధాలు నెరిపేవాడు. బానిసలు రనీర్‌కు శారీరకంగా దగ్గరయ్యేలా ప్రలోభాలకు గురిచేసేవాడు. వారి వ్యక్తిగత సమాచారం, అభ్యంతరకర ఫోటోలను భద్రపరిచేవాడు. రవీన్‌పై మహిళల అక్రమ రవాణా, దోపిడీ, నేరపూరిత కుట్ర, బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువుకావడంతో 2019 జూన్‌లో కోర్టు దోషిగా నిర్ధారించింది. బాధితులు 15 మందిలో 13 మంది మహిళలు బ్రూక్లిన్‌ కోర్టుకు హాజరుకాగా, మరో 90 మందికి పైగా బాధితులు జడ్జి నికోలస్‌ గరాఫికి లేఖలు రాశారు. చదవండి : మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్‌

1998లో న్యూయార్క్‌ రాష్ట్రంలో నెక్సిమ్‌ పేరుతో రనీర్‌ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2018లో మెక్సికోలో అరెస్టయిన రనీరే 20 సంవత్సరాల లోపు మహిళలతో వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం ఏర్పాటు చేసిన సబ్‌ గ్రూప్‌ను తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. వీరిలో 15 సంవత్సరాల బాలిక సైతం ఉన్నారు. తన బాధితులు అనుభవించిన క్షోభ, ఆగ్రహం పట్ల రనీర్‌ విచారం వ్యక్తం చేస్తూనే తనపై వచ్చిన అభియోగాలు వాస్తవం కాదని కోర్టుకు నివేదించారు. రనీర్‌కు జీవిత ఖైదు కాకుండా 15 సంవత్సరాల జైలు శిక్ష సరిపోతుందని ఆయన న్యాయవాదులు వాదించగా కోర్టు తోసిపుచ్చింది. రవీన్‌తో పాటు మరో ఐదుగురు నిందితులకూ కోర్టు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు