విషాదం.. పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి.. మంచులో గడ్డకట్టి..

26 Dec, 2022 14:00 IST|Sakshi

వాషింగ్టన్‌: పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి చేరాడు ఓ వ్యక్తి. మంచులో గడకట్టి ప్రాణాలు విడిచాడు. అతను కన్పించట్లేదని పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత కొన్ని గంటలకే విషాదంలో మునిగిపోయారు. మంచుదిబ్బలో అతని మృతదేహం దొరకడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో ఈ ఘటన జరిగింది.

చనిపోయిన వ్యక్తి పేరు విలియం క్లే(56). డిసెంబర్ 24న అతని బర్త్‌డే. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ బీభీత్సం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు విలియం. చాలాసేపైనా తిరిగిరాలేదు.

దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు కూడా దీన్ని ధ్రవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కరోజు ముందే తండ్రితో చాలాసేపు మాట్లాడానని, ప్రేమిస్తున్నాని చెప్పానని బోరున విలపించాడు.

మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా(దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు.
చదవండి: పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ ‍చేస్తుండగా కాల్పులు.. టిక్‌ టాక్ స్టార్ మృతి

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు