ప్రేమ.. పెళ్లి పేరిట మొగుళ్లకు నిత్య పెళ్లి కూతురి మోసాలు

24 Jul, 2021 19:16 IST|Sakshi
పోలీసుల అదుపులో రుచి వర్మ (ఫొటో: livehindustan.com)

లక్నో: ఆమె ప్రేమిస్తే యువకులు కుటుంబాలను వదిలేసి వచ్చేస్తారు. ఆమె లోకంలో మునిగి తేలుతారు. ఆ యువతి కోసం కుటుంబాలను వదిలేసి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అందం.. ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయి ఇలా యువకులను ప్రేమించి.. పెళ్లాడి.. వారిని దోచేసుకుని మాయమవడం ఆమెకు పరిపాటి. యువకుల వీక్‌నెస్‌ను పట్టుకున్న ఆమె నిత్య పెళ్లికూతురిలా మారిపోయింది. పెళ్లి చేసుకున్న యువకుల నుంచి నగదు, ఆభరణాలు.. కుదిరితే ఆస్తులు రాయించుకుని పారిపోతుంది. అలాంటి ఆమెపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని బాబుపూర్వకు చెందిన అమిత్‌ శర్మ గోవింద్‌నగర్‌లో నివసించే రుచివర్మను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. గాఢంగా ప్రేమించుకుంటున్న వీరిరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా 2020 జూన్‌ 4వ తేదీన ఆర్య సమాజ్‌లో పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. అప్పుడు కరోనా మొదటి దశ ఉండడంతో ఆ పెళ్లికి ఎవరినీ పిలవలేకపోయారు. వివాహానంతరం వీరిద్దరి కాపురం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి నవంబర్‌ 23వ తేదీన వచ్చి బంధువుల పెళ్లి ఉందని చెప్పి రుచి వర్మను తన వెంట తీసుకెళ్లింది.

ఆ సమయంలో రుచి తనతో పాటు రూ.50 వేల నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్లింది. పెళ్లి కోసం వెళ్లిన తన భార్యకు రోజు ఫోన్‌ చేస్తుండగా స్విచ్ఛాఫ్‌ వస్తోంది. వస్తుందని భావించగా కొన్ని రోజులైనా రాకపోవడంతో నేరుగా అత్తింటి వారికి వెళ్లాడు. ‘నిన్ను తీసుకెళ్లడానికి వచ్చా రా’ అని అడగ్గా అతడితో వెళ్లేందుకు భార్య రుచి వర్మ నిరాకరించింది. తల్లి కూడా పంపించేందుకు ససేమిరా చెప్పింది. బిత్తరపోయిన అమిత్‌ అక్కడ తెలిసిన వారి వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె నిజ స్వరూపం బయటపడింది.

పుట్టింటికి వచ్చిందే మరో వ్యక్తితో పెళ్లి చేసుకునేందుకు వచ్చిందని తెలిసి షాక్‌ తిన్నాడు. మొదట ఈ విషయాన్ని నమ్మలేదు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోతో అవాక్కయాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడితో పాటు మరొకరిని కూడా రుచి వర్మ పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలుసుకున్నాడు. ఆమె విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ.. పెళ్లి పేరిట మోసం చేసి అందిన కాడికి దోచుకుని వెళ్తుందని ఆమె నిజస్వరూపం బట్టబయలైంది. ఆమె నిత్య పెళ్లి కూతురిలా తయారు కావడానికి తల్లి సహకరిస్తోందని తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నీ చేసినా అమిత్‌ మాత్రం రుచి వర్మతో కలిసి ఉండాలని ఉందని పోలీసులకు చెప్పాడు. న్యాయం చేయాలని అమిత్‌ పోలీసులను విజ్ఞప్తి చేశాడు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు