బాలలపై వేధింపుల నివారణకు చర్యలు

1 Feb, 2022 03:53 IST|Sakshi

బాలిక ఆత్మహత్యతో స్పందించిన మహిళా కమిషన్‌ 

విజయవాడ ‘ఫిట్జీ’ స్కూలుకు నోటీసులు 

సాక్షి, అమరావతి: తనకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయవాడ విద్యార్థిని ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ ఉదంతంపై తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లిన కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విద్యాలయాల్లో బాలబాలికలకు ఏవిధమైన కౌన్సెలింగ్‌ ఇస్తున్నారనే దానిపై ఆరా తీశారు. చదువుతున్న బాలికల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను అమలు చేస్తున్నారా? లేదా? అంటూ మృతురాలు చదువుకున్న విజయవాడలోని ఫిట్జీ స్కూల్‌ యాజమాన్యానికి సోమవారం నోటీసులు జారీ చేశారు.

చిన్నారుల శరీర భాగాలను తాకడం వెనుక దురుద్దేశాలను పసిగట్టేందుకు వారికి తరగతి గదుల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న చర్యలేమిటని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయాన్ని వివరణ కోరుతూ లేఖ రాశారు. బాలలపై వేధింపుల అంశంపై విద్యాలయాల్లో కచ్చితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. తద్వారా వారిలో ధైర్యం నింపి  అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు