-

విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు 

1 Mar, 2023 03:54 IST|Sakshi

ప్రేమోన్మాదికి జీవిత ఖైదు గతేడాది అక్టోబర్‌ 8న తూర్పు గోదావరి జిల్లాలో ఘటన  

డిగ్రీ విద్యార్థిని దేవికను పాశవికంగా హత్య చేసిన ప్రేమోన్మాది 

చలించిపోయిన సీఎం వైఎస్‌ జగన్‌ 

మృతురాలి కుటుంబానికి  రూ.10 లక్షలు ఎక్స్‌గ్రే షియా 

త్వరితగతిన విచారణ జరపాలని  పోలీసులకు ఆదేశం 

7 రోజుల్లోనే చార్జిషీట్‌.. త్వరితగతిన విచారణ 

స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ

కాకినాడ లీగల్‌: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పా­రు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్‌ ట్రయల్‌ కేసుల మానిటరింగ్‌ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. 

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు.

గతేడాది అక్టోబర్‌ 8న కాండ్రేగుల – కూరాడ  మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్‌పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై  కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు.  

కన్విక్షన్ బేస్డ్‌ ట్రయల్‌ కేసుల మానిటరింగ్‌ వ్యవస్థతో సత్ఫలితాలు 
విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్‌బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు.

ఇందుకు కన్విక్షన్ బేస్డ్‌ ట్రయల్‌ కేసుల మానిటరింగ్‌ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో  విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు. 

మరిన్ని వార్తలు