మీ సంగతి చూస్తా.. పోలీస్‌స్టేషన్‌లో వీరంగం

28 Sep, 2020 09:55 IST|Sakshi

పోలీస్ స్టేషన్‌లో ప్రజా ప్రతినిధి భర్త, అతని అనుచరుల హంగామా

సాక్షి, రంగారెడ్డి : ఎవడ్రా నా మనుష్యులను తీసుకొచ్చింది.. అంతా మీ ఇష్టమేనా..? నా చేతిలో ఈరోజు మీరు అయిపోయార్రా, నా కొడకల్లారా.. అంటూ చిత్తుగా తాగి మద్యం మత్తులో పోలీసు స్టేషన్లో నానా రభస సృష్టించి తన అనుచరులతో హంగామా చేసిన ఓ మహిళా ప్రజా ప్రతినిధి భర్త తతంగం ఇది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరి గూడ మండల పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి రభస సృష్టించిన మండల ప్రజా పరిషత్ (వైస్ ఎంపిపి) అస్రబేగం భర్త ఏజాజ్ అలీ తన అనుచరులు కొందరిని వెంటేసుకుని వచ్చి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఆదివారం నాడు చౌదరిగుడ మండల ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గుట్కా జర్దా ప్యాకెట్లు పట్టుకున్న సందర్భంలో తమ వారిని విడిచి పెట్టాలని అర్ధరాత్రి  మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ పైకి ఎజాజ్ అలీతో పాటు అతని అనుచరులు పోలీస్ స్టేషనుపై దాడికి పాల్పడ్డారు. అతని అనుచరులు కొందరు పోలీస్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. నానా బూతులు తిట్టారు. ('అద్దె'రిపోయే స్కెచ్‌.)

మద్యం మత్తులో ఎజాజ్ అలీ, అజ్జు తదితర వ్యక్తులు మరి కొంతమందిని తీసుకొచ్చి మీరు గుట్కాలు ఎలాపట్టుకుంటారని? పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఎంత నచ్చచెపినా వినకుండా అర్ధరాత్రి నానా హంగామా సృష్టించారు. ఈ వ్యవహారంపై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. శాంతి భద్రతలను రక్షించే పోలీసుల పట్ల ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్టేషన్ పై దాడికి ప్రయత్నించిన నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై మండల ఎస్సై కృష్ణ ను వివరణ కోరగా ఆయన ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు