లాభం పేరిట లూటీ! నాలుగు నెలల్లో 48 కేసులు

23 May, 2022 07:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్‌ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్‌ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ కేసులే అధికంగా ఉంటున్నాయి. 

48 కేసులు.. రూ.2.75 కోట్ల మోసం.. 
సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్‌ నేరాలు 200 శాతం మేర పెరిగాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్‌ నేరస్తుల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్‌ నేరాలకు ప్రధాన కారణం. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 48 ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితులు రూ.2,75,05,919 సొమ్మును పోగొట్టుకున్నారు. ఈ బాధితుల్లో అత్యధికంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులే ఉన్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  వర్చువల్‌గా లాభాలు వచ్చినట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్‌ కట్‌ చేస్తున్నారు.  

నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. 
బహుళ జాతి కంపెనీలలో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్‌ రంగం ఉద్యోగులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్‌ వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్‌ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్‌ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్‌ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు ఉదాహరణ. 

24 గంటల్లోపు ఫిర్యాదు చేయండి 
యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచ్చినట్లు ఫోన్‌లో కనిపించినా అవి బ్యాంక్‌ ఖాతాలో జమ కావు. సైబర్‌ నేరాలకు గురైన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే  సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. డయల్‌ 100కు లేదా 1930 నంబర్లలో ఫిర్యాదు చేయాలి.     
– డాక్టర్‌ లావణ్య, డీసీపీ, సైబర్‌ క్రైమ్స్, సైబరాబాద్‌  

(చదవండి: భూ బకాసురులు! రూ.50 కోట్ల స్థలం పై కన్ను)

మరిన్ని వార్తలు