దళిత యువతిపై అమానుషం.. జుట్టుపట్టుకొని కొడుతూ.. వీడియో వైరల్‌

29 Dec, 2021 15:48 IST|Sakshi

లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాలిక పట్ల కొందరు వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీలోని అమేథీ పరిధిలో ఒక యువతి తమ ఇంట్లో చోరీ చేసిందనే ఆరోపణలతో కొందరు బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఇంటిలో బంధించారు.

ఆ తర్వాత.. ఇద్దరు వ్యక్తులు ఆమెను నేలపై తొసేసి.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. పాపం బాలిక దెబ్బలకు తాళలేక ఏడుస్తూ ఉంటే వారు ఏమాత్రం జాలిచూపడం లేదు. ఇద్దరు మహిళలు కూడా బాలికను తీవ్రంగా దూషిస్తున్నారు. బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలిక దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తు ఉండే  దుర్మార్గులు మాత్రం ఏ మాత్రం జాలీ చూపలేదు. కాగా, ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు.

బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనిపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీటర్‌లో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.  మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. యోగీ ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీటర్‌ వేదికగా స్సందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.

అమేథీ పోలీసు అధికారి అర్పిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతావారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యోగి ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తుందని.. ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది. 

మరిన్ని వార్తలు