Vijay Mallya: భారీ షాకిచ్చిన లండన్‌ కోర్టు

26 Jul, 2021 21:02 IST|Sakshi

 మాల్యా దివాలా తీసినట్టు ప్రకటించిన లండన్ హైకోర్టు

భారతీయ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు

తద్వారా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం

లండన్‌: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు  భారీ  షాక్‌  తగిలింది. మాల్యా అప్పగింత కేసును  సోమవారం విచారించిన లండన్ హైకోర్టు విజయ్ మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు.  ఈ మేరకు లండన్‌  కోర్టు  సంచలన తీర్పు వెలువరించింది.

ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో గతకొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు  భారీ విజయం లభించినట్టైంది. అయితే దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి బ్రిగ్స్ నిరాకరించారు.

ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పునిచ్చిన లండన్ హైకోర్టు తాజాగా మాల్యా దివాలా తీసినట్టుగా ప్రకటించడం గమనార‍్హం. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మంజూరు చేసిన 9వేల కోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు 13 భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఆయనపై ఆరోపణలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు