గంజాయి తాగుతాడు, పనికిరాని వాడు: దివ్య తల్లి

15 Oct, 2020 17:46 IST|Sakshi

అసత్యాలు ప్రచారం చేయవద్దు: దివ్య తల్లి ఆవేదన

ఈ ఉన్మాదం ఇంకెంతకాలం: వాసిరెడ్డి పద్మ

సాక్షి, విజయవాడ: ‘‘కావాలనే నా కుమార్తె గురించి ప్రేమ, పెళ్లి అని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా దివ్య భీమవరంలోని మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. అపురూపంగా చూసుకున్నాం. ఆ నాగేంద్ర పెయింటింగ్‌ పని చేస్తాడు. గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడు. అలాంటి తిరుగుబోతుకు, దివ్య పేరుతో సంబంధం కలుపుతున్నారు. ఎందుకు పనికిరానివాడిని తను ఎందుకు పెళ్లిచేసుకుంటుంది? ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’’అంటూ ఉన్మాది స్వామి చేతిలో బలైపోయిన దివ్య తేజస్విని తల్లి కుసుమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది)

తన కూతురు గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వినిని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్ర బాబు అలియాస్‌ స్వామి, గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ  చికిత్స పొందుతూ దివ్య మృతి చెందిన విషయం విదితమే.(చదవండి: దివ్య, స్వామి మంచి స్నేహితులు)

ఈ ఉన్మాదం ఇంకెంతకాలం: వాసిరెడ్డి పద్మ
నగరంలో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటనను మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంట్లోకి చొరబడి, నిద్రపోతున్న అమ్మాయిపై దాడి చేయడం దారుణం. తన గొంతు కోసి అమానుషంగా ప్రవర్తించాడు. మంచం మీద నిద్ర పోతున్న పిల్ల.. మార్చురీకి వచ్చి చేరింది. ఇటువంటి ఆగడాలను అరికట్టాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టం తెచ్చారు. ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి.

‘‘నేను ప్రేమిస్తే.. నాకే దక్కాలి’’ అనే ఉన్మాదం ఎంతకాలం? ప్రేమించకపోతే మరణ శాసనం రాస్తారా..? చంపేస్తారా?’’ అని ప్రశ్నించాలి. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసేవిధంగా, కేంద్రం కూడా దిశ లాంటి చట్టానికి వెంటనే ఆమోదం తెలపాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. యేళ్ల తరబడి కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ ఘటనలు పెరుగుతున్నాయి. మనోవర్తి కేసులపై కూడా న్యాయ వ్యవస్థ ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. శిక్షలు పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆడ పిల్లలు మా ప్రాణం, మా ప్రాధాన్యత అనేలా అందరూ ఆలోచించాలి. ప్రేమ పేరుతో ఉన్మాదం, దారుణాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడాలి’’అని పేర్కొన్నారు. 


 

>
మరిన్ని వార్తలు