విజయవాడ: అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురి అరెస్టు

10 Aug, 2020 17:40 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాలరావుతో పాటు.. జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోటల్‌ నిర్వాహకులతో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
(విజయవాడ ప్రమాదంపై చంద్రబాబు స్పందించరే?)

కమిటీ పరిశీలన
అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్‌ను జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ సోమవారం పరిశీలించింది. ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్‌లను కమిటీ సభ్యులు ధ్యానచంద్, గీతాబాయి, ఉదయభాస్కర్, రమేష్ బాబు పరిశీలించారు. మూడు అంశాల ప్రాదిపదికన విచారణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. స్వర్ణప్యాలెస్ హోటల్‌లో సంరక్షణ చర్యలు, కోవిడ్ నిబంధనలు.. ప్రమాద కారణంపై విచారణ చేస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేదా రసాయనాల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని కమిటీ అధికారిణి గీతాబాయి తెలిపారు. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.

కాగా, రమేష్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా అనుమతులు లేకుండా.. స్వర్ణ హైట్స్‌ (స్వర్ణ ప్యాలెస్‌)లో కోవిడ్ ఆస్పత్రి నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు గుర్తించారు. 20 బెడ్ల కెపాసిటీతో అనధికారికంగా స్వర్ణ హైట్స్‌ను.. కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి ఆస్పత్రి యాజమాన్యం లీజ్‌కు తీసుకున్నట్టు వెల్లడైంది. ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదికల అనంతరం ప్రమాద కారణాలపై స్పష్టత రానుంది. ఇక జేసీ శివశంకర్‌ కమిటీతోపాటు కృష్ణా జిల్లా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
(విషాద 'జ్వాల')

మరిన్ని వార్తలు