Krishna: నిద్రిస్తుండగా కరెంటు వైరుతో మెడకు చుట్టి..

17 Dec, 2021 10:09 IST|Sakshi

నూజివీడు: ఆస్తి కోసం సొంత తాతయ్యనే మనవడు హత్య చేశాడు. ఆపై దానిని దుండగుల పనిగా చిత్రీకరించి విఫలయ్యాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కోటవారిపేటకు చెందిన జూవ్వనపూడి గంగులు(70) అలియాస్‌ ఆదం ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే నిద్రిస్తూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటనపై పట్టణ ఎస్‌ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ఎస్‌ ప్రసన్నవీరయ్యగౌడ్‌ మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మృతుడికి నలుగురు కుమారులు కాగా, భార్య, రెండు, మూడో కుమారులు గతంలో మృతిచెందారు. ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయమై వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మృతుడు గంగులు తన రెండు ఇళ్లను, పెద్ద కుమారుడైన శేఖర్‌కు రాస్తూ వీలునామా రాశాడు. దీంతో తన తాతపై మూడో కుమారుని కొడుకు, మనవడైన జువ్వనపూడి వరప్రసాద్‌(21) కక్ష పెంచుకున్నాడు.  


స్నేహితుని సాయంతో.. 
దీంతో వరప్రసాద్‌ తన స్నేహితుడైన నూజివీడు మండలం ఎంఎన్‌పాలెంకు చెందిన వనుకూరి ప్రేమకుమార్‌(23)తో కలిసి ఈనెల 11న అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో గంగులు తన ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా కరెంటు వైరుతో మెడకు చుట్టి గట్టిగా లాగి చంపారు. ఆ తర్వాత రూ.70వేల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, గొలుసు, ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత తనకు సహకరించినందుకు గాను తన స్నేహితుడికి రూ.30వేలు నగదు, రెండు ఉంగరాలను ఇచ్చాడు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ పట్టణ, రూరల్, ముసునూరు ఎస్‌ఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ని బట్టి కుటుంబ సభ్యులే ఈ ఘాతునికి పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారించిన పోలీసులు.. 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ ఎస్‌ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్‌ఐలు తలారి రామకృష్ణ, ఎం. లక్ష్మణ్, కె. రాజారెడ్డి, అజయ్, సిబ్బందికి రివార్డులను అందజేశారు.

చదవండి: అమ్మో! చెడ్డీ గ్యాంగ్‌!! స్కెచ్‌ వేశారో..

 

మరిన్ని వార్తలు