బాలల అక్రమ రవాణాకు చెక్‌ 

27 Apr, 2023 04:52 IST|Sakshi

బిహార్‌కు చెందిన 18 మంది బాలలను సంరక్షించిన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ 

విజయవాడ ఎస్‌కేసీవీ చిల్డ్రన్స్‌ ట్రస్ట్‌ వసతి గృహానికి తరలింపు 

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): బిహార్‌ రాష్ట్రం నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తున్న మైనర్‌ల అక్రమ రవాణాను విజయవాడ ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అడ్డుకుని వారిని రక్షించారు. విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డీఎస్‌సీ(డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌) వల్లేశ్వర బీటీ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మైనర్‌ (బాలురు)లను ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ముజఫర్‌పూర్‌ స్టేషన్‌ నుంచి బెంగళూరు, చెన్నైలకు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది.

దీనిపై జీఆర్‌పీ పోలీసులు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌(బీబీఏ) సంస్థ, చైల్డ్‌లైన్‌ ప్రతినిధుల సహకారంతో మంగళవారం రాత్రి రైలు విజయవాడ చేరుకోగానే రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి సుమారు 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న 18 మంది బాలలను గుర్తించి సంరక్షించారు. అనంతరం వారిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరిచి, వారి ఆదేశాల మేరకు తాత్కాలిక వసతి కోసం ఎస్‌కేసీవీ చిల్డన్స్‌ ట్రస్ట్‌ వసతి గృహానికి తరలించారు.

బాలల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి తగిన ఆధారాలతో వన తల్లిదండ్రులకు వారిని అప్పగిస్తామని తెలిపారు. బాలల అక్రమ రవాణా చట్ట వ్యతిరేకమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్‌లో ఆర్ఫీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ మకత్‌లాల్‌నాయక్, జీఆర్‌పీ ఎస్‌ఐ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు