లంచం ఇస్తే కేసు పెట్టనన్నాడు.. ఏసీబీ వలలో పడ్డాడు

14 Jul, 2021 19:19 IST|Sakshi
పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌

సాక్షి,పెద్దేముల్‌( వికారాబాద్‌): ఏసీబీ అధికారుల వలకు పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ చిక్కారు. ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు చేయకుండా వదిలేసేందుకు లంచం డిమాండ్‌ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని మంబాపూర్‌కు చెందిన నర్సింలు, శేఖర్‌కు చెందిన ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా ఇటీవల పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సీజ్‌ చేశారు. గత నెల 23న ఒక ట్రాక్టర్, ఈనెల 5న మరో వాహనాన్ని పట్టుకున్నారు. ఈ విషయంలో మంబాపూర్‌ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్‌ ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను సంప్రదించారు. రూ.50 వేలు ఇస్తే కేసు నమోదు చేయకుండా ట్రాక్టర్లను వదిలేస్తానని ఎస్‌ఐ స్పష్టం చేశారు.     దీంతో ఎంపీటీసీ ఈనెల 11న రూ.20 వేలను ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు ముట్టజెప్పారు. మిగతా డబ్బులను మరోరెండు రోజుల్లో సమకూరుస్తానన్నారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అవినీతి వే«ధింపులను తాళలేక ఎంపీటీసీ శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 
పక్కా ప్లాన్‌ ప్రకారం పట్టుకున్నారు
ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు రోజులుగా మాటు వేశారు. మంగళవారం ఉదయం ఎంపీటీసీ శ్రీనివాస్‌కు కెమికల్స్‌ను కలిపిన నగదు ఇచ్చి పంపించారు. ఉదయం నుంచి ఎస్‌ఐకి డబ్బులు ఇవ్వాలని ప్రయతి్నంచారు. సాయంత్రం సమయంలో అనువైన సమయం దొరకడంతో ఎంపీటీసీ ఠాణాలో ఉన్న ఎస్‌ఐ వద్దకు వెళ్లి రూ.30 వేలను అందించారు. అక్కడే మాటు వేసి ఉన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ బృందం వెంటనే పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అయితే, కొంతకాలంగా ఎస్‌ఐ భూ వివాదాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా విషయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఠాణాకు వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకున్నారని మండలవాసులు చెబుతున్నారు.   
సమాచారం ఇవ్వండి పట్టుకుంటాం 
అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రజలు సమాచారం అందించాలని ఏసీబీ డీసీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. అధికారులు డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తే 9440446140 నంబర్‌లో సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి లంచావతారులను పట్టుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు