అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!

3 May, 2021 13:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భార్యను హత్య చేసిన భర్త

ఠాణాలో లొంగిపోయిన నిందితుడు

సాక్షి, వికారాబాద్‌ : ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.ఆంజనేయులు, లక్ష్మి(40) దంపతులు. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులో ఉంటున్నారు. ఆంజనేయులు స్థానికంగా మున్సిపాలిటీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండేది. ఈనేపథ్యంలో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని ఆంజనేయులు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో లక్ష్మి కుటుంబ కలహాలతో వారంరోజుల క్రితం స్వగ్రామం మద్వాపూర్‌కు వెళ్లింది. ఆంజనేయులు పిల్లలను తాండూరులోనే వదిలేసి శనివారం సొంతూరుకు వెళ్లిపోయాడు. ఇంట్లో అర్ధరాత్రి సమయంలో లక్ష్మి నిద్రిస్తుండగా కమ్మ కత్తితో దారుణంగా పొడిచాడు.

ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి చనిపోయింది. నిందితుడు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం మద్వాపూర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో లక్ష్మి పిల్లలు రేణుక, రాజు, నాగరాజు అనాథలయ్యారు. ఈమేరకు నిందితుడు ఆంజనేయులుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు