ప్రాణం తీసిన ‘ట్రెజర్‌ హంట్‌’.. బావిలో దాచిన వస్తువును తీస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

31 Oct, 2022 13:18 IST|Sakshi
సాయికుమార్‌(ఫైల్‌) 

వికారాబాద్‌ జిల్లా ధారూర్‌లో ఘటన 

అడ్వంచర్‌ క్లబ్‌ నిర్వాహకుడిపై కేసు 

ధారూరు: ‘ట్రెజర్‌ హంట్‌’ఓ పర్యాటకుని ప్రాణం తీసింది. బావిలో పడేసిన వస్తువును బయటకు తీయడమే ఈ ఆట ఉద్దేశం. 35 ఏళ్ల వివాహితుడు ఈ సాహసానికి ఒడిగట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. సీఐ తిరుపతిరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్‌ అడ్వంచర్‌ క్లబ్‌ మూన్‌లైట్‌ క్యాంపింగ్‌ గోదంగూడలో ఉంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన సికింద్రాబాద్‌ వాసి సీఎల్‌పీ సాయికుమార్‌(35) నలుగురు మిత్రులతో కలిసి శనివారం ఈ మూన్‌లైట్‌ క్యాంపింగ్‌కు వచ్చాడు. మిత్రులంతా కలిసి సాహసోపేతమైన గేమ్‌ ఆడాలనుకున్నారు. నిర్వాహకుల అనుమతి తీసుకుని.. 30 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో ‘ట్రెజర్‌ హంట్‌’ఆడాలని నిర్ణయించారు. బావిలోకి ఓ వస్తువును వదిలిపెట్టి, దాన్ని తీసుకొచ్చే టాస్క్‌ పెట్టారు. ఆ వస్తువును తీయడానికి సాయికుమార్‌ బావిలోకి దూకాడు. ఈ దృశ్యాన్ని మిత్రులు వీడియో తీస్తున్నారు. నీటిలో ఊపిరి ఆడక ఓ సారి పైకి వచ్చిన సాయికుమార్‌ రెండోసారి ప్రయత్నించి బయటికి రాలేదు.

మిత్రులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బావిలో గాలించి సాయికుమార్‌ను బయటికి తీశారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయికుమార్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువు వింధ్య ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ అడ్వంచర్‌ క్లబ్‌ నిర్వాహకుడు కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. సాయికుమార్‌కు భార్య వినీత, రెండేళ్ల కూతురు ఉంది.  

మరిన్ని వార్తలు