ఏం సేస్తిరి..ఏం సేస్తిరి..చావు తెలివితేటలంటే ఇదేనేమో

23 Jul, 2021 09:05 IST|Sakshi
బాధిత కుటుంబీకులతో మాట్లాడుతున్న వ్యవసాయ అధికారులు

రైతుబంధు కోఆర్డినేటర్‌ మాయాజాలం 

నకిలీ డెత్‌ సర్టిఫికెట్, ఇతర రికార్డులు సృష్టి 

మీ ఖాతాలో మా ధాన్యం డబ్బులు పడ్డాయని డ్రా చేసుకున్న వైనం  

‘రైతుబంధు’ రాకపోవడంతో ఆరా.. అసలు విషయం వెలుగులోకి..

 కుల్కచర్ల మండలంలో ఘటన  

నమ్మించి మోసం చేశాడంటున్న వ్యవసాయ అధికారులు 

సాక్షి, కుల్కచర్ల(వికారాబాద్‌): బతికున్న మనిషి చనిపోయినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించి రైతుబీమా సొమ్మును స్వాహా చేశారు. రైతుబంధు కోఆర్డినేటర్‌ ఇందులో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుల్కచర్ల మండలం పుట్టపహడ్‌కు చెందిన రాఘవేందర్‌ రెడ్డి రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ (57) 2020 సెప్టెంబర్‌ 14న చనిపోయిందని అదే నెల 30న నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించాడు. వ్యవసాయశాఖ అధికారులను మభ్యపెట్టి రైతుబీమా ప్రక్రియను పూర్తి చేశాడు. రైతుబీమా డబ్బులొచ్చాక.. తమకు సంబంధించిన ధాన్యం డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయని బాధిత కుటుంబ సభ్యులకు నమ్మబలికి వారి దగ్గర నుంచి తీసుకున్నాడు.  

రైతుబంధు కోఆర్డినేటర్‌ మాయాజాలం  
రైతుబంధు కోఆర్డినేటర్‌ రాఘవేందర్‌రెడ్డి అధికార పార్టీ నాయకుడు. పుట్టపహడ్‌కు చెందిన చంద్రమ్మకు 1.30  ఎకరాల భూమి ఉండగా.. సహకార సంఘంలో ఉన్న దీర్ఘకాలిక రుణమాఫీ చేయించడంతో పాటు పంట నష్టం డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి పట్టా పాసుపుస్తకం, పాలసీ సర్టిఫికెట్‌ తీసుకున్నాడు. 2020 సెప్టెంబర్‌ 14న చంద్రమ్మ మరణించినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించాడు. డిసెంబర్‌ 14న రూ.2 లక్షలు, 2021 జనవరిలో రూ.3 లక్షలు చొప్పున బాధిత కుటుంబం నుంచి డబ్బులను డ్రా చేయించి తీసుకున్నాడు. 

విషయం బయటికి వచ్చింది ఇలా.. 
పుట్టపహడ్‌కు చెందిన ఎనుగొండ చంద్రమ్మకు సర్వే నంబరు 129/15/అ, 207/రులో ఎకరా 30 గుంటల భూమి ఉంది. ఈమె వ్యవసాయం, దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మేలో ప్రభుత్వం అందించిన రైతుబంధు డబ్బులు చంద్రమ్మకు రాకపోవడంతో ఆమె కుమారుడు బాలయ్య వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన అధికారులు.. మీ అమ్మ చనిపోయింది కదా.. రైతుబీమా డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పడంతో అవాక్కయ్యాడు. వెంటనే గ్రామ పెద్దలకు తెలపడంతో అసలు విషయం బయటపడింది. ఇది విన్న స్థానికులు విస్తుపోయారు.

నిందితుడిపై ఫిర్యాదు చేశాం  
పుట్టపహడ్‌ గ్రామ కోఆర్డినేటర్‌ రాఘవేందర్‌ తమను నమ్మించి మోసం చేశాడని మండల వ్యవసాయశాఖ అధికారి వీరస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయిందని తమకు సమాచారం అందించి.. తర్వాత బాధితురాలి కుమారుడు బాలయ్యను తీసుకొచ్చి రైతుబీమాకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేశాడని తెలిపారు. డిసెంబర్‌ 9న రైతుబీమా డబ్బులు చంద్రమ్మ నామిని బాలయ్య ఖాతాలో జమ అయినట్లు పేర్కొన్నారు. రైతుబంధు కోఆర్డినేటర్‌ రాఘవేందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 

మమ్మల్ని మోసం చేశాడు 
బ్యాంకులో ఉన్న రుణం తగ్గిస్తామని, పంట నష్టం వేయిస్తానని మా దగ్గర పట్టా పాసుపుస్తకాలు తీసుకున్నాడు. డబ్బులు పడ్డాక మా వడ్ల పైసలు మీ ఖాతాలో పడ్డాయని నా కుమారుడు బాలయ్యను తీసుకుని వెళ్లి పైసలన్నీ తీసుకున్నాడు. రైతుబంధు రాకపోవడంతో వ్యవసాయ అధికారుల వద్ద ఆరా తీయగా.. మాకు అసలు విషయం తెలిసింది. నేను బతికుండగానే చనిపోయానని పత్రాలు సృష్టించడం చాలా దుర్మార్గం. ఇందుకు కారణమైన ప్రతీఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. రైతుబంధు డబ్బులు ఇప్పించాలి.
 – చంద్రమ్మ, బాధితురాలు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు