సచివాలయ ఉద్యోగి దుర్మరణం.. రెండు నెలల క్రితమే వివాహం..

2 Nov, 2021 08:36 IST|Sakshi

సాక్షి, బెళుగుప్ప (అనంతపురం): మండలంలోని నారింజ గుండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండాకు చెందిన పార్వతీబాయి, కృష్ణానాయక్‌ దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్‌ నాయక్‌ (26).. శ్రీరంగాపురం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహమైంది.

సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్‌ నాయక్‌.. వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. గుండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా రాయదుర్గం వైపు వెళుతున్న కారు (ఏపీ02 బీఆర్‌ 0735) వేగాన్ని డ్రైవర్‌ నియంత్రించుకోలేక ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనంతో పాటు రాజశేఖర్‌నాయక్‌నీ 80 మీటర్ల దూరం కారు లాక్కెళ్లింది. ఘటనలో రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న బెళుగుప్ప ఎస్‌ఐ రుషేంద్రబాబు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పెద్దన్న, ఎంపీడీఓ ముస్తాఫా కమాల్‌బాషా అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు.

చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..) 

రాజశేఖర్‌నాయక్‌ (ఫైల్‌)  

మరిన్ని వార్తలు