విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై.. 

17 Nov, 2021 07:35 IST|Sakshi
రావెల నాగచైతన్య(పాత చిత్రం)

డెంగీ, కామెర్ల లక్షణాలతో గ్రామ వలంటీర్‌ మృతి 

పెళ్లికి ముందు రోజు అనారోగ్యంతో వైద్యశాలలో చేరిక

లింగంగుంట్ల గ్రామంలో విషాదఛాయలు 

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు 

సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్‌.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.

ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) 

పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు.    

మరిన్ని వార్తలు