చిత్ర హింసలు.. పారిపోయిన వివాహిత.. ఆపై

10 Oct, 2020 11:08 IST|Sakshi

జుట్టు కత్తిరించి, దుస్తులు తొలగించి.. ఆపై

న్యూఢిల్లీ/ఇటానగర్‌: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హథ్రాస్‌ ఉదంతం తర్వాత సుమారు 10 రోజులకు జరిగిన అమానుష ఘటన ఇది. భర్త పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక తనకు తోడుగా ఉంటాడని నమ్మి మరో వ్యక్తితో ఊరు విడిచి వెళ్లిన మహిళకు ఎదురైన చేదు అనుభవం. పంచాయితీ తీర్చి కుటుంబంతో కలుపుతామని చెప్పిన గ్రామ పెద్దలు ఆమెను ఒక్కదాన్నే దోషిగా తేల్చి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అత్యంత అవమానకర రీతిలో శిక్ష విధించిన వైనం. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్‌లాంగ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రంజన, దిబేశ్వర్‌ డియోరి(పేర్లు మార్చాం) ఇద్దరు భార్యాభర్తలు. ఐదేళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం, రితుల్‌(పేరు మార్చాం) అనే వ్యక్తితో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో వారి జాడను కనుగొన్న రితుల్‌ కుటుంబ సభ్యులు ఇంటికి రమ్మని ఆహ్వానించారు. తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో రితుల్‌ మాటలు నమ్మి అతడితో వెళ్లిన రంజనాదే తప్పని పేర్కొంటూ, జట్టు కత్తిరించి, నగ్నంగా మార్చి, చన్నీళ్లతో స్నానం చేయించి అలాగే రాత్రంతా బడిలో నిద్రించాలని తీర్పునిచ్చారు. మహిళలు రంజనకు శిక్ష అమలు చేస్తుండగా, పురుషులు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. ‘(చదవండి: పన్నెండేళ్ల బాలికపై కజిన్స్‌ అత్యాచారం)

చిత్ర హింసలు పెట్టేవాడు.. అయినా
‘మా మధ్య స్నేహం తప్ప ఎటువంటి బంధం లేదు. రితుల్‌కు నా పరిస్థితి గురించి తెలుసు. ఐదేళ్లుగా ప్రతిరోజూ నా భర్త చేతిలో అనుభవిస్తున్న నరకాన్ని కళ్లారా చూశాడు. నా భర్త రోజూ తీవ్రంగా హింసించేవాడు. గర్భవతిగా ఉన్న సమయంలో నా కడుపులో తన్నాడు. దాంతో గర్భస్రావం అయ్యింది. రెండుసార్లు ఇలాగే చేశాడు. ఆ తర్వాత అతడి ఆగడాలు శ్రుతిమించాయి. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా మా అత్తమ్మ ఆయనను ఒక్కమాట అనేవారు కాదు. పైగా ఆయనకే వత్తాసు పలుకుతూ నన్నే నిందించేవారు.

ఈ విషయం గురించి ఇరు వర్గాల పెద్ద సమోంలో అనేకసార్లు పంచాయితీ జరిగింది. కానీ నా తలరాత మాత్రం మారలేదు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అలాంటి సమయంలో ఒకానొక రోజు రితుల్‌ నా దగ్గరికి వచ్చి విడాకులు తీసుకోమని, తనను పెళ్లి చేసుకోమని కోరాడు. అలా చేస్తే నా జీవితం బాగుపడుతుందని చెప్పాడు. కానీ అప్పటికే అతడికి వివాహమై, గొడవలు జరుగుతున్నందున ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకించాను. అయినా తను పట్టువదల్లేదు. ఊరు విడిచి వెళ్లి ఏదైనా పని చేసుకుంటూ బతుకుదామంటూ నన్ను ఒప్పించాడు. 

అసోంలోని తిన్సుకియాకు నన్ను తీసుకువెళ్లాడు. కానీ ఇదంతా ఎందుకో సరైందిగా తోచలేదు. అంతలోనే రితుల్‌ కుటుంబం మా జాడను కనుక్కున్నారు. మాకు ఫోన్‌ చేశారు. ఇంటికి తిరిగి రావాలని, తప్పు సరిదిద్దుకుంటే క్షమిస్తామని చెప్పారు. దాంతో సెప్టెంబరు 25న కారులో ఊరికి బయల్దేరాం. రాత్రి అక్కడికి చేరుకునే సమయానికి కొంతమంది పెద్ద మనుషులు మాకోసం ఎదురుచూస్తున్నారు. కారులో నుంచి నన్ను బయటకు లాగి జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు.

ఆ తర్వాత నగ్నంగా మార్చి చన్నీళ్లతో స్నానం చేయించి, జుట్టు కత్తిరించారు. చేతులు అడ్డుపెట్టుకునైనా నన్ను నేను కాపాడుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ, కొట్టి అవమానించారు. ఆడవాళ్లు నా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సమయంలో వాళ్ల కొడుకులు, భర్తలు ఫోన్లలో నా ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత నన్ను ఓ స్కూళ్లోకి పంపించి అక్కడే నిద్రించాలని ఆదేశించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు’’ అని బాధితురాలు ఓ జాతీయ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. 

40 వేలు వసూలు చేశారు
ఆ మరుసటి రోజు తన కుటుంబ సభ్యులను తీసుకుని రచ్చబండ దగ్గరకు రావాలని ఆదేశించారన్న రంజన, తన తాతయ్య దగ్గర 40 వేల రూపాయలు తీసుకుని, తనను గ్రామ బహిష్కరణ చేశారని తెలిపారు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న లేకంగ్‌లోని వుమెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్కొటిక్స్‌ సెల్‌ పోలీసులకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో 38 మంది గ్రామస్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తొమ్మిది మంది మహిళలతో సహా 15 మందిని అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో డబ్ల్యూడబ్ల్యూఏఎన్‌సీ కార్యదర్శి రూబి డియోరి మాట్లాడుతూ.. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు పోరాడాతామని స్పష్టం చేశారు. హథ్రాస్‌ ఘటనతో దేశమంతా అట్టుడుకుతున్న వేళ మహిళల పట్ల ఇలాంటి హేయమైన నేరాలు ఇంకెన్నో జరుగుతున్నాయని, ఇది నిజంగా సమాజం సిగ్గుపడాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సాటి మహిళలు సైతం సంప్రదాయాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బాధితురాలి పట్ల అవమానకరంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు