టీచర్‌ పాడు బుద్ధి.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించి..

4 Mar, 2022 21:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ధర్మారం(ధర్మపురి)జగిత్యాల జిల్లా: ఓ ఉపాధ్యాయుడే విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించిన ఘటన ధర్మారం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు టీచర్‌ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌డే సందర్భంగా విద్యార్థులకు సెల్‌ఫోన్‌లో సైన్స్‌ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుంచి పాఠశాలకు సెలవులు రావడంతో ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు గురువారం తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు.

చదవండి: ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని..

దీంతో ఆమె ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపోద్రిక్తులైన వారు ఫోన్‌ చేసి, హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి పాఠశాలకు చేరుకొని, ఆ ఉపాధ్యాయుడిని గదిలో బంధించి, చితకబాదారు. టీచర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు డీఈవోకు తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్‌ రాత్రి గ్రామానికి వెళ్లి, విచారణ జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.  

మరిన్ని వార్తలు