Hyderabad: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ..

3 Jan, 2022 18:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ భర్త కోసం ఇద్దరు పెళ్లాలు గొడవ పడటం చాలా చూశాం. కానీ ఓ భార్య కోసం ఇద్దరు భర్తలు తగువులాడుకోవడం ఎక్కడైనా చూశారా.. తాజాగా హైదరాబాద్‌లో ముద్దుల భార్య కోసం ఇద్దరు భర్తలు ఎంతకైనా తెగించేందుకు సిద్దమయ్యారు. ఆమెను దక్కించుకునేందుకు పోరాడుతూ.. రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్లాడుకున్నారు. చివరకు ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్లాం పంచాయితీ మీడియా ముందుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన శశికాంత్‌కు మొదటి భార్య చనిపోవడంతో ఆమె సోదరి దుర్గకు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్లు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది.

ఇటీవల ఫేస్‌బుక్‌లో సత్య ప్రసాద్‌ అనే వ్యక్తితో దుర్గకు పరిచయం ఏర్పడింది. వీరి ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకొని అతనితోనే ఉంటుంది. అయితే భార్య కనిపించడం లేదని మొదటి భర్త శశికాంత్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దుర్గ- సత్య ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేసును ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు సత్యప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తాను దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, గతంలో ఆమెకు పెళ్లైన విషయం తెలియదని సత్యప్రసాద్‌ పోలీసులకు తెలిపాడు.‌
చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్‌ నోట్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారుడి పేరు?

దీంతో పోలీసులు దుర్గను కూడా విచారించాలనుకోగా.. మూడు నెలల కిందట కనిపించకుండా పోయి మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆమె మాట్లాడుతూ.. తనకు శశికాంత్‌తో పెళ్లి జరగలేదని సత్యప్రసాద్‌నే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు పిల్లలు లేరంటూ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అంతేగాక భర్తతో కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దుర్గ మొదటి భర్తతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ వచ్చారు. దుర్గను ఇంటికి రమ్మని అడిగారు. అయితే వాళ్లేవరో తనకు తెలియదంటూ దుర్గ తిట్టిపోసింది. మీడియా ముందే ఆమె ఇద్దరు భర్తలు దుర్గ తనదంటే తనదేనని వాగ్వాదానికి దిగారు. చివరికి. ప్రియుడు సత్య ప్రసాద్‌తోనే ఉంటానని దుర్గ తేల్చి చెప్పింది. ఇక ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
చదవండి: బండి సంజయ్‌కు రిమాండ్‌.. కరీంనగర్‌ జైలుకు తరలింపు

మరిన్ని వార్తలు