Viral Video: దళిత బాలికపై అమానుషం.. కాళ్లు కట్టేసి.. కర్రతో కొట్టి

30 Dec, 2021 10:54 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం పేరుతో ఓ దళిత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాళ్లు చేతులు కట్టేసి, తీవ్ర వేధింపులకు గురిచేశారు. యూపీలోని అమేథీ జిల్లాలోని రాయ్‌పూర్‌ పుల్వారీ పట్టణంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు 16ఏళ్ల దళిత బాలికను బంధించి చితకబాదారు. దొంగతనం పేరుతో కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు బాలికను కింద పడేయగా.. మరో వ్యక్తి ఆమె రెండు కాళ్ల కళ్ల మధ్య కర్రను ఉంచి మరో కర్రతో కొడుతూ క్రూరంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు సైతం దాడిని అడ్డుకోకుండా నిందితులకు సహకరించారు. బాలిక నొప్పి పుడుతుందని చెబుతున్నా కూడా ఎలాంటి కనికరం లేకుండా వ్యక్తి ఆమెను నేల మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవ్వడంతో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో పట్టుకోకపోతే, తీవ్ర ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోందని ట్వీట్‌ చేశారు. ‘అమేథీలో దళిత బాలికపై నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటనను ఖండిస్తున్నాం. యోగీ ఆదిత్యానాథ్‌ పాలనలో ప్రతిరోజూ సగటున 34 దళితులపై, మహిళలపై 135 నేరాలు జరుగుతున్నాయి, అయినా మీ శాంతిభద్రతలు నిద్రపోతున్నాయి.’ అంటూ చురకలంటించారు.
చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి

అదే విధంగా అమేథీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక అమేథీ ఎస్పీ స్పందిస్తూ.. ముగ్గురు నిందితులు శుభ గుప్తా, రాహుల్‌ సోని, సూరజ్‌ సోనిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురికి మతిస్థిమితం సరిగా లేదని, దారి మరిచిపోవడం వల్ల ఆ ఇంట్లోకి పొరపాటున వెళ్లిందని బాధితురాలి తండ్రి తెలిపారు. దీంతో దొంగతనం చేసిందనన్న నెపంతో కూతురిపై ఇలా దాడి చేశారని ఆరోపించారు.
చదవండి: బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!

మరిన్ని వార్తలు