హత్య కేసుని ఛేదించడం కోసం బాబా సాయం కోరిన పోలీసులు: వీడియో వైరల్‌

19 Aug, 2022 14:10 IST|Sakshi

అధికార హోదాలో ఉన్న పోలీసులే ఓ హత్య కేసు చేధించడం కోసం బాబాని సాయం కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు  బమిత పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ శర్మ ఒక మైనర్‌ హత్య కేసు విషయమై బాబా పండోఖర్‌ సర్కార్‌ సాయం తీసుకోవడవం పెద్ద కలకలం రేపింది. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో అధికారులు సీరియస్‌ అయ్యారు. దీంతో పోలీసు సూపరిండెంట్‌ సచిన్‌ శర్మ సదరు అసిస్టెంట్‌ సీఐ అనిల్‌ శర్మని సస్పెండ్‌ చేశారు. ఆయన స్థానంలో పంకజ్‌ శర్మని నియమించారు.

అసలేం జరిగిందంటే....జులై 28న ఓటపూర్వ గ్రామంలో బావి నుంచి 17 ఏళ్ల బాలిక మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాలిక బంధువులు తమ గ్రామస్తులైన రవి అహిర్వార్‌, గుడ్డా అలియాస్‌ రాకేష్‌, అమన్ అహిర్వార్‌లు ఈ హత్య చేశారని ఆరోపిస్తూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

కానీ ఆ తర్వాత తగిన సాక్షాధారాలు లేవంటూ పోలీసులు వారిని వదిలేశారు. అకస్మాత్తుగా కొద్ది రోజుల తర్వాత పోలీసులు విచారణలో ఆ బాలిక మేనమామ తిరత్‌ అహిర్వారే ఈ హత్య చేసినట్లు చెప్పారు. తన మేనకోడలు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఈ హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాలిక బంధువులు ఒక్కసారిగా నిర్ఢాంతపోయారు.

ఆ తర్వాత పోలీసులు ఈ కేసు విషయమై బాబాను సాయం కోరిన వీడియో లీక్‌ అవ్వడంతో వివాదస్పదమైంది. అంతేకాదు వీడియోలో బాబా.. నిందితుడు మజ్‌గువాన్‌ ప్రాంతానికి చెందినవాడని, అతనే ఈ కేసులో కీలక నేరస్తుడని చెప్పడం విశేషం. దీంతో అధికారులు ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేయడమే కాకుండా తదుపరి విచారణ బాధ్యతలను సబ్ డివిజనల్ పోలీసు అధికారి మన్మోహన్ సింగ్ బఘెల్‌కు అప్పగించారు.

(చదవండి: బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్‌ కుటుంబం

మరిన్ని వార్తలు