సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు

29 Aug, 2020 14:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందన్నారు. అయితే అందులో కొన్ని దృశ్యాలు తొలగించినట్లు కనిపిస్తోందని.. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరో ముండనం చేసిన కేసులో నూతన్‌ నాయుడు భార్య ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. అలాగే వారి ఇంట్లో పనిచేసే వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: నూతన్‌ నాయుడు భార్యపై కేసు నమోదు)

పని మానేశాడన్న కోపంతో..
విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో శ్రీకాంత్‌ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని బాధితుడిని పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు